Harish Rao: వాహనాల లైఫ్ ట్యాక్స్ పెంపును ఉపసంహరించుకోవాలి: హరీశ్‌రావు
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:34 AM
కొత్త వాహనాల జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)ను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
సిద్దిపేట ఆగస్టు 15, (ఆంధ్రజ్యోతి): కొత్త వాహనాల జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్)ను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పన్నుల రూపంలో ప్రజలపై భారం మోపడం తగదన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి చర్యల వల్ల పాలనలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రోడ్డు ట్యాక్స్ కింద వచ్చే ఆదాయాన్ని రూ.8,500 కోట్లకు పెంచుతున్నామని బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించగా.. అంత డబ్బు ఎలా వస్తుంది, ప్రజలపై అదనపు పన్నుల భారం మోపుతారా ? అని తాము ప్రశ్నించామని హరీశ్ తెలిపారు. ప్రజలపై ఎలాంటి భారం వేయమని నాడు చెప్పిన ప్రభుత్వం నేడు మాట తప్పిందని విమర్శించారు. పేద, సామాన్య ప్రజలకు కనీస అవసరంగా మారిన వాహనాలపై పన్నుల భారాన్ని పెంచారని అన్నారు. గత నెలలో వాహనాలపై సర్వీస్ ట్యాక్స్‌ను పెంచారని, ఇటీవల లైఫ్ ట్యాక్స్‌ను పెంచారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ హయాంలో పన్నులు తగ్గిస్తే ప్రస్తుతం రేవంత్ రెడ్డి పన్నులు పెంచుతున్నారని విమర్శించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పన్నుల రూపంలో రూ.7,100 కోట్లకుగానూ ప్రభుత్వం రూ. 6,900 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. వాహనాల కొనుగోలప్పుడు వసూలు చేసే లైఫ్ ట్యాక్స్ పెంపుతో ప్రజలపై మరింత భారం వేస్తున్నారని చెప్పారు. గత నెల, ఈ నెలలో రవాణా శాఖ పన్నుల పెంపు పేరిట ప్రజలపై రూ.2 వేల కోట్ల అదనపు భారం మోపుతూ తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పన్నుల బాదుడు వెనుక కుట్ర దాగి ఉందని హరీశ్ ఆరోపించారు. కొత్తగా ఆన్యూనిటీ పేరుతో రోడ్లు వేస్తామని చెబుతున్న ప్రభుత్వం పన్ను రూపంలో వచ్చే సొమ్మును కాంట్రాక్టర్లకు చెల్లించాలని చూస్తుందని తెలిపారు.