Harish Rao: మేడిగడ్డకు ఒక నీతి.. సుంకిశాలకు ఇంకో నీతా?: హరీశ్ రావు
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:42 AM
మేడిగడ్డకు చిన్న మరమ్మతులు చేసి గోదావరి నీళ్లను ఎత్తిపోసే అవకాశం ఉన్నా.. బీఆర్‌ఎ్‌సను బదనాం చేయాలనే ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
మేడిగడ్డకు చిన్న మరమ్మతులు చేసి గోదావరి నీళ్లను ఎత్తిపోసే అవకాశం ఉన్నా.. బీఆర్‌ఎ్‌సను బదనాం చేయాలనే ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సుంకిశాల విషయంలో తమ లోపాలు ఎక్కడ బయటపడతాయోనని గుట్టుచప్పుడు కాకుండా మరమ్మతులు చేస్తోందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుంకిశాల మీద నిపుణుల కమిటీ విచారణ ఉండదని, విజిలెన్స్ విచారణ వేయరని, న్యాయ కమిషన్ ఏర్పాటు చేయరని, ఎన్డీఎ్‌సఏ నివేదిక .. ఇవేమీ లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా మరమ్మతులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. అదే మేడిగడ్డలో రెండు పియర్స్ కుంగితే అన్ని విచారణలు ఉంటాయన్నారు.
ఎన్డీఎ్‌సఏ, నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం, ఇంకా పలు సంస్థలు కుంగిన పియర్స్‌కు మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని కోరినా, నిర్మాణ సంస్థ ముందుకొచ్చినా కేవలం రాజకీయ స్వార్థంతో తెలంగాణ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టడం కాంగ్రెస్ మార్కు రాజకీయం అని ఎద్దేవా చేశారు. ‘ప్రజా వ్యతిరేక- ప్రతిపక్ష వేధింపు’ పాలనకు ఇది నిదర్శనమని విమర్శించారు. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. చెప్పిన గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు ఇకనైనా అమలు చేయకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.