Share News

Harish Rao: చెంచుబిడ్డల అరెస్టు.. సీఎం నిరంకుశత్వానికి నిదర్శనం

ABN , Publish Date - May 20 , 2025 | 05:05 AM

నల్లమల బిడ్డనంటూ గొప్పలు చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి.. తనను కలిసేందుకు వచ్చిన అమాయక చెంచుబిడ్డలను అరెస్టు చేయించడం ఆయన నిరంకుశత్వానికి నిదర్శనమని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.

Harish Rao: చెంచుబిడ్డల అరెస్టు.. సీఎం నిరంకుశత్వానికి నిదర్శనం

  • తక్షణమే వారిని విడుదల చేయాలి

  • కాంగ్రెస్‌ అసమర్థ పాలనను ప్రజలు గుర్తిస్తున్నారు: హరీశ్‌రావు

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి) : నల్లమల బిడ్డనంటూ గొప్పలు చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి.. తనను కలిసేందుకు వచ్చిన అమాయక చెంచుబిడ్డలను అరెస్టు చేయించడం ఆయన నిరంకుశత్వానికి నిదర్శనమని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసి, చెంచు ఉద్యమ నాయకులను నిర్బంధించడమే ప్రజా పాలనా..? అంటూ సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ప్రసంగంలో తమ పరిపాలన ప్రయోజనాలను ప్రజలు పదేపదే గుర్తుచేసుకుంటున్నారని డబ్బా కొట్టుకున్నారన్నారు. హామీలు అమలు చేయడం లేదని కాంగ్రెస్‌ అసమర్థ పాలనను పదేపదే గుర్తుచేసుకుంటున్నది మాత్రం వాస్తవమని హరీశ్‌ ఎద్దేవా చేశారు.


విద్యాభరోసా పేరిట రూ.5 లక్షల కార్డు కోసం విద్యార్థులు... 2 లక్షల ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, పింఛన్లు ఎప్పుడు పెంచుతారా? అని వయోవృద్ధులు, దివ్యాంగులు ఎదురు చూస్తున్నారన్నారు. నాగర్‌కర్నూల్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు ప్రయత్నించిన చెంచు సోదరులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోడుపట్టా భూముల్లో సాగు చేసుకోనివ్వడం లేదని, తమ సంక్షేమం కోసం ఐటీడీఏ పీవోగా ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించాలని వారు కోరడంలో తప్పేముందని ప్రశ్నించారు. అక్రమంగా అరెస్టు చేసిన చెంచు ప్రతినిధులను, అమ్రాబాద్‌ పోలీసుస్టేషన్లో నిర్బంధించిన చెంచు బిడ్డలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - May 20 , 2025 | 05:05 AM