Share News

రైతుల చావులు సీఎంకు కనిపించడం లేదా?

ABN , Publish Date - Jan 20 , 2025 | 05:05 AM

అప్పులు తీర్చాలని బ్యాంకులు చేస్తున్న వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల చావులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కనిపించడం లేదా ?

రైతుల చావులు సీఎంకు కనిపించడం లేదా?

402 మంది అన్నదాతల మరణాలు ప్రభుత్వ హత్యలే.. భరోసా ఇవ్వడంలో సర్కారు విఫలం

  • బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌ రావు

  • ఆదిలాబాద్‌లో 24 గంటల్లో ఇద్దరు అన్నదాతల మృతిపై ఆవేదన

  • రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాకు డిమాండ్‌

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): అప్పులు తీర్చాలని బ్యాంకులు చేస్తున్న వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల చావులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కనిపించడం లేదా ? అని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. గడిచిన ఏడాది కాలంలో 402 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ మరణాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌లో ఆయన ఓ పోస్టు చేశారు. రుణ భారాన్ని మోయలేక, బ్యాంకు సిబ్బంది వేధింపులు తాళలేక ఆదిలాబాద్‌లో 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందని హరీశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, వరుసగా జరుగుతున్న రైతు ఆత్మహత్యలే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.


కేసీఆర్‌ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చితే ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని దుయ్యబట్టారు. రుణ మాఫీ కోసం కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూతిరిగి విసిగిపోతున్న రైతులు... భూములు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ అని, రూ.500 బోనస్‌ అని మోసం చేసి ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ పరిస్థితి దాపురించిందని వాపోయారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, రైతులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. మరణించిన రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. ఇక, రేషన్‌ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం జారీ చేసి ఉత్తర్వుల వల్ల లక్షల మంది నష్టపోతున్నారని హరీశ్‌ రావు పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో నిబంధనలు సవరించాలని కోరుతూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. పౌర సరఫరాల శాఖ జనవరి 11న ఇచ్చిన మెమో ప్రకారం భూపరిమితి, ఆదాయానికి సంబంధించి పదేళ్ల కిందటి నిబంధనలే ఉంచారని పేర్కొన్నారు. ఈ నిబంధనల వల్ల అంగన్‌వాడీలు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, చిరుద్యోగులకు రేషన్‌ కార్డు జారీ అవ్వదని వివరించారు. ద్రవ్యోల్బణం ఆధారంగా ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్‌ చేశారు. కులగణన సర్వే ఆధారంగా రే షన్‌ కార్డులు ఇస్తామన్న నిబంధనను కూడా మార్చాలని హరీశ్‌రావు కోరారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆరున్నర లక్షల రేషన్‌ కార్డులు జారీ చేశామని గుర్తు చేశారు. రేషన్‌లో సన్న బియ్యాన్ని ఇవ్వాలని, రేషన్‌ దుకాణాలను మినీ సూపర్‌ మార్కెట్లుగా మార్పు చేసి డీలర్లకు రూ.5వేలు గౌరవ వేతనం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ తరఫున డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 20 , 2025 | 05:05 AM