Harish Rao: కాళేశ్వరంపై సీఎంది దుష్ప్రచారం
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:21 AM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రూ.లక్ష కోట్లు వృథా అయ్యాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
లక్ష కోట్లు వృథా అంటున్న సీఎం మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు ఎలా తీసుకెళ్తారు?
పాలకుల ప్రతికూల ఆలోచనా ధోరణితో రాష్ట్రాభివృద్ధికి నష్టం: హరీశ్
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రూ.లక్ష కోట్లు వృథా అయ్యాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం వృథా అయితే మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకెళ్తానని ఎలా అన్నారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. పాలకుల ప్రతికూల ఆలోచన ధోరణితో రాష్ట్రాభివృద్ధికి నష్టం కలుగుతోందని వాపోయారు. యూకే పర్యటనలో ఉన్న హరీశ్‌రావు శుక్రవారం అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు మాట్లాడారు. కాళేశ్వరంతో రూ.లక్ష కోట్లు వృథా అంటున్న సీఎం.. మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకెళ్తానని అన్నారని, ఇందుకోసం 7000 కోట్లతో టెండర్లు కూడా పిలిచారని హరీశ్ తెలిపారు. కాళేశ్వరం నీళ్లను మూసీకి ఎలా తీసుకువస్తారో రేవంత్ రెడ్డే చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం శంకుస్థాపన చేసిన గంధమల్ల ప్రాజెక్టుకు మల్లన్న సాగర్ నుంచే నీళ్లు రావాలన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అందువల్లే మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల అంశాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రూ.400 కోట్ల వ్యయంతో బ్యారేజీ మరమ్మతులు పూర్తవుతాయని హరీశ్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, ఎల్లంపల్లి, పెద్దవాగు ప్రాజెక్టులు వారి ప్రభుత్వంలోనే కూలాయన్న హరీశ్... రైతుల ప్రయోజనాలు దెబ్బతినేలా రాజకీయాలు చేయడం తగదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూల దృక్పథం లేకపోవడంలో అభివృద్ధి ఆశాజనకంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాలో రాష్ట్రం అనేక రంగాల్లో మేటిగా నిలిచిందని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం గూగుల్ ప్రచారానికే పరిమితం కావడం దురదృష్టకరమని వాపోయారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ వల్ల రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించామని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టడంతో భూముల ధరలు పెరిగాయని అన్నారు.