Harish Rao: రేవంత్‌వి ప్రతీకార రాజకీయాలు: హరీశ్
ABN , Publish Date - May 27 , 2025 | 04:41 AM
ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అభద్రతా భావంతో ప్రతీకార రాజకీయలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు.
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అభద్రతా భావంతో ప్రతీకార రాజకీయలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. కేటిఆర్‌కు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డిపై ఆయన ధ్వజమెత్తారు. కట్టుకథలు కల్పించి పెట్టిన కేసులు కోర్టుల్లో, ప్రజా క్షేత్రంలో నిలబడవన్నారు. సత్యమే గెలుస్తుందని, తామంతా కేటిఆర్‌కు అండగా ఉన్నామని హరీశ్‌రావు ఎక్స్‌లో పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అడుగడుగునా అవస ్థపడుతున్నారని, అకాల వర్షాలవల్ల ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే రైతన్నల కన్నీటి గోస చూడాల్సి వస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు.
ధాన్యం కొనుగోలు చేయాలని అడిగిన రైతులపై పోలీసుల దాష్టీకం అన్యాయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతులపై పగబట్టిన ప్రభుత్వం పంటల సాగుకు పెట్టుబడి లేకుండా చేసిందని, కష్టాలకోర్చి పండించిన పంటను కొనకుండా ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అన్నదాతలకు బేడీలు, పోలీసుల పిడిగుద్దులు తప్ప సాధించిందేమీ లేదన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదని, దీన్ని గుర్తుంచుకోవాలంటూ హరీశ్‌రావు రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు.