Groundwater: భూగర్భ జలాల్లో భారీగా ఫ్లోరైడ్
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:22 AM
రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సాంద్రత భారీగా పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన వార్షిక భూగర్భ జలాల నివేదిక-2024లో ఈ విషయం వెల్లడైంది.
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో అత్యధికం!
భూగర్భ జలాల నివేదిక-2024లో వెల్లడి
దేశవ్యాప్తంగా 263 జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య
జలాలను భారీగా తోడేయడమూ కారణమే!
హైదరాబాద్, ఆగస్టు 12: రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సాంద్రత భారీగా పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన వార్షిక భూగర్భ జలాల నివేదిక-2024లో ఈ విషయం వెల్లడైంది. భూగర్భ జలాలను విపరీతంగా తోడేయడం కూడా ఫ్లోరైడ్ పెరగడానికి కారణమని పేర్కొంది. దేశంలోని మొత్తం 722 జిల్లాలకు గాను 263 జిల్లాల్లో భూగర్భ జలాల్లో పరిమితికి మించి ఫ్లోరైడ్ సాంద్రత ఉన్నట్లు వెల్లడించింది. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ గాఢత 1.5ఎంజీ/ఎల్‌కు మించరాదు. అయితే భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ గాఢత ఎక్కువగా ఉన్న జిల్లాలు 2017లో దేశవ్యాప్తంగా 207 ఉండగా.. 2023 నాటికి ఆ సంఖ్య 263కు పెరిగిందని వివరించింది. తెలంగాణలోని 33 జిల్లాలకు గాను 28 జిల్లాల్లో ఫ్లోరైడ్ గాఢత ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ గాఢత పెరగడానికి విపరీతంగా బోరు బావులను తవ్వడం కూడా కారణమని తెలంగాణ భూగర్భ జల విభాగం డైరెక్టర్ కె.లక్ష్మా తెలిపారు. పశ్చిమ, దక్షిణ భారత రాష్ట్రాల్లో భూగర్భ జలాలను భారీగా తోడేస్తున్నారని.. ఫ్లోరైడ్ పెరగడానికి ఇదో కారణమని భూగర్భ జల నివేదికలోనూ వెల్లడించింది. రాజస్థాన్ (43.17ు), హరియాణా (23.66ు), కర్ణాటక (17.68ు), తెలంగాణ (17.87ు), గుజరాత్ (13.92ు), పంజాబ్ (13.77ు), ఆంధ్రప్రదేశ్ (11.31ు) రాష్ట్రాల్లో ఫ్లోరైడ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని వివరించింది. అయితే వర్షాకాలం ముందు కంటే తర్వాత భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం కొంత మేరకు తగ్గుతోందని తెలిపింది. 2023లో వర్షాకాలానికి ముందు దేశంలోని వివిధ జిల్లాల్లో 9.14 శాతం ఫ్లోరైడ్ ఉండగా.. వర్షాకాలం తర్వాత 7.74 శాతానికి తగ్గిందని నివేదిక వెల్లడించింది. తెలంగాణలో సేకరించిన నమూనాల్లో ఇది 20 శాతం, 15.49 శాతంగా ఉన్నట్లు తెలిపింది.