ఆగస్టు నాటికి ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే సిద్ధం!
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:21 AM
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ నాలుగు లైన్ల జాతీయ రహదారి ఆగస్టు నాటికి అందుబాటులోకి రానున్నది.
శరవేగంగా పనులు.. 70 శాతం పూర్తి
ఖమ్మం,ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ నాలుగు లైన్ల జాతీయ రహదారి ఆగస్టు నాటికి అందుబాటులోకి రానున్నది. వాస్తవానికి మార్చినెలాఖరు నాటికి పనులు పూర్తి చేసుకోవాలని జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) లక్ష్యంగా పెట్టుకున్నా.. పలుచోట్ల బ్రిడ్జిల నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా ఆలస్యమైంది. వైరా నదిపై బ్రిడ్జితో పాటు పలుచోట్ల వాగులు, ఖమ్మం అర్బన్‌లోని వెంకటగిరి రైల్వే క్రాసింగ్ బ్రిడ్జి, ధంసలాపురం ఎగ్జిట్ ఏర్పాటు వల్ల పనులు కొంత జాప్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆగస్టు నాటికి పనులు పూర్తి చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ఐదు ప్యాకేజీలతో మొదలైన గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల్లో 3 ప్యాకేజీలు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో నడుస్తుండగా, మరో 2 ప్యాకేజీలు ఏపీలో నడుస్తున్నాయి. నేషనల్ హైవే 365 బీజీ కింద నిర్మితమవుతున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఖమ్మం మీదుగా రాజమండ్రి, విశాఖ మధ్య జరిగే రవాణాను మరింత సులభతరం చేయనుంది. కాకినాడ, విశాఖ పోర్టులకు కూడా వేగంగా సరుకు రవాణా చేయవచ్చు. ప్రస్తుతం కాకినాడ వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి కోదాడ మీదుగా ఎక్కువగా రాకపోకలు జరుగుతున్నాయి. మొత్తం 162 కి.మీ. పొడవున ఈ రహదారి నిర్మాణం పూర్తయితే విజయవాడ వైపు వెళ్లకుండానే సూర్యాపేట, ఖమ్మం, దేవరపల్లి మీదుగా రాజమండ్రి, విశాఖ, కాకినాడకు వేగంగా చేరుకోవచ్చు. సుమారు 4 గంటలపైగా సమయం ఆదా అవుతుంది. విశాఖ, రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కూడా కోదాడ వైపు వెళ్లకుండా ఖమ్మం మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ఈ రహదారి త్వరలో నిర్మాణం కాబోతున్న నాగపూర్-అమరావతి జాతీయ రహదారులకూ అనుసంధానం కానుంది.
రహదారి పనులు 70 % పూర్తి
ఖమ్మం-దేవరపల్లి నాలుగు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులు 70శాతం పూర్తయ్యాయి. ఆగస్టు నాటికి పూర్తి చేసి రాకపోకలు ప్రారంభిస్తాం. రైల్వే బ్రిడ్జితో పాటు ధంసలాపురం ఎగ్జిట్ వంటి పనుల వల్ల కొంత జాప్యం ఉంది. వైరా నుంచి దేవరపల్లికి రెండు నెలల్లో పనులు పూర్తవుతాయి. అయితే టోల్‌ప్లాజాల ఏర్పాటుకు టెండర్లు, ఇతర పనులకు ఆగస్టు వరకు సమయం పడుతుంది.
- కె.దివ్య, నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్