Kaleshwaram Project: క్యాబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:41 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల నిర్మాణానికి తొలుత మంత్రివర్గం ఆమోదం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బ్యారేజీలపై నిర్ణయం తీసుకొని, నిర్మాణం ప్రారంభించిన తర్వాతనే మంత్రివర్గంలో ఆమోదింపజేసుకున్నారు
గుర్తించిన ప్రభుత్వం.. జస్టిస్ ఘోష్ కమిషన్‌కు లేఖ సిద్ధం
నిరూపించే అన్ని వివరాలతో నేడు సీల్డ్ కవర్‌లో సమర్పణ!
హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల నిర్మాణానికి తొలుత మంత్రివర్గం ఆమోదం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యారేజీల నిర్మాణాల కోసం నిర్ణయం తీసుకున్న ఏడాది తర్వాత, బ్యారేజీల నిర్మాణం ప్రారంభించి, డీపీఆర్‌ను కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో సమర్పించి.. ఆ తర్వాత మంత్రివర్గంలో ఆ నిర్ణయాన్ని ఆమోదింపజేసుకున్నారని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు లేఖను సిద్ధం చేసింది. దీనికి అనుబంధంగా మంత్రివర్గ నిర్ణయాలకు సంబంధించిన వివరాలను కాలానుక్రమంగా జతచేసింది. ఈ వివరాలన్నింటినీ మంగళవారం సీల్డ్ కవర్‌లో కమిషన్‌కు అందించనుంది. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఈ నెల 11న హాజరైన మాజీ సీఎం కేసీఆర్.. బ్యారేజీల నిర్మాణంపై నిర్ణయం తానొక్కడినే తీసుకోలేదని, ఆ నిర్ణయం మొత్తం మంత్రివర్గానిదని తెలిపారు.
అంతకు ముందు ఈ నెల 6న ఈటల రాజేందర్, 9న హరీశ్‌రావు కూడా ఇదే చెప్పారు. కానీ, వారు చెప్పింది అబద్ధమని ప్రస్తుత మంత్రి తుమ్మల ఖండించారు. మరోవైపు, ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ.. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రూ.2,591 కోట్లతో పరిపాలనపరమైన అనుమతినివ్వాలని అప్పటి ఈఎన్‌సీ మురళీధర్ 2016 ఫిబ్రవరి 18న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా... ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీకి అనుమతినిస్తూ 2016 మార్చి 1న జీవో 231 జారీ చేసినట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. జీవో విడుదలైన 14 రోజుల తర్వాత అంటే 2016 మార్చి 15న హరీశ్‌రావు చైర్మన్‌గా, ఈటల రాజేందర్, తుమ్మలనాగేశ్వరరావులను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జీవో నెం.655 జారీ చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. కాగా, ఈనెల 26వ తేదీలోపు జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశాలున్నాయని తె లుస్తోంది.