Mahabubabad: ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల జోరు
ABN , Publish Date - Jun 17 , 2025 | 05:50 AM
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతూ మూత పడే స్థితికి చేరుకుంటుండగా... అందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
అడ్మిషన్లలో కల్వల ప్రాథమిక పాఠశాల రికార్డు
మూడు రోజుల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు
కేసముద్రం (మహబూబాబాద్ జిల్లా), జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతూ మూత పడే స్థితికి చేరుకుంటుండగా... అందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లాలోని కేసముద్రం మండలం కల్వల ప్రాఽథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మూడు రోజుల క్రితం వరకు 65 ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 130కి చేరింది. ఒకప్పుడు ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడిన తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ధైర్యంగా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకాన్ని మళ్లీ పెంచేలా చేసింది.
నెల్లికుదురు మండలం నర్సింహులగూడెంలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఎస్ కె.సయ్యద్ తన కూతురును ఇదే పాఠశాలలో ఐదో తరగతిలో చేర్పించారు. గూడూరులో వీఆర్‌ఏగా పనిచేస్తున్న పెసర మహేష్ తన కుమారుడు వర్షిత్‌ను ఒకటో తరగతిలో, పాలేరు నవోదయ పాఠశాలలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న పెద్దారపు సంపత్ తన కూతురు స్పృతికను రెండో తరగతిలో చేర్పించడం గమనార్హం. ప్రభుత్వం అందించే యూనిఫాంతో పాటు హెచ్‌ఎం కళ్లెం వీరారెడ్డి తన సొంత ఖర్చులతో వారంలో రెండు రోజులు ధరించే ప్రత్యేక యూనిఫాంను విద్యార్థులకు అందజేశారు. అలాగే రూ. 40 వేలు వెచ్చించి కార్పొరేట్ స్కూల్ తరహాలో పాఠశాలకు రంగులు వేయించారు. గ్రామ పెద్దల సహకారంతో, ఉపాధ్యాయుల సమష్టి కృషితో తల్లిదండ్రుల నమ్మకాన్ని పొందామని హెచ్‌ఎం కళ్లెం వీరారెడ్డి తెలిపారు.