Share News

టెక్స్‌టైల్‌ పార్కు భూములపై విచారణకు ఆదేశం

ABN , Publish Date - Mar 13 , 2025 | 05:40 AM

టెక్స్‌టైల్‌ పార్కు భూముల వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం ప్రచురించిన కథనం కలకలం రేకెత్తించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. భూసేకరణ ఎలా చేశారు? ఎంత భూమిని సేకరించారు

టెక్స్‌టైల్‌ పార్కు భూములపై విచారణకు ఆదేశం

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందించిన ప్రభుత్వం

  • వివరాలు సేకరించి నివేదిక రూపొందిస్తున్న అధికారులు

  • నిషేధిత భూముల జాబితాలో, రికార్డుల్లో తేడాల గుర్తింపు!

  • పార్కు ఏర్పాటు చేయకుంటే భూములు తిరిగివ్వాలి: రైతులు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/షాద్‌నగర్‌/నందిగామ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): టెక్స్‌టైల్‌ పార్కు భూముల వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం ప్రచురించిన కథనం కలకలం రేకెత్తించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. భూసేకరణ ఎలా చేశారు? ఎంత భూమిని సేకరించారు? భూసేకరణ చేసే సమయంలో నిబంధనలు ఏం పెట్టారు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిధులు ఇచ్చాయి? ఎన్ని నిధులు దుర్వినియోగమయ్యాయి? కేంద్రం ఆదేశించిన తరువాత ఎంత భూమిని ధరణిలో నిషేధిత జాబితాలో పెట్టారు? ఽప్రస్తుతం ఆ జాబితాలో లేని భూమి ఎంత? వంటి వివరాలతో నివేదిక పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై రెవెన్యూ అధికారులు నివేదిక రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌ టెక్స్‌టైల్‌ పార్కు కోసం రాజధాని శివార్లలోని నందిగామ మండలం చేగూర్‌లో 22 ఏళ్ల క్రితం సేకరించిన 142 ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నట్లు వారి పరిశీలనలో వెల్లడైంది. ధరణికి ముందు, తరువాత.. నిషేధిత జాబితాలో పెట్టిన భూముల వివరాల మధ్య కూడా వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించినట్లు తెలిసింది. కాగా.. దుర్వినియోగమైన రూ.కోట్ల నిధులను రాబట్టే విషయంలో బెంగుళూరు ఆర్బిట్రరీలో కేసు నడుస్తున్నట్లు ప్రభుత్వానికి వారు సమాచారం అందించారు.


మా భూములు మాకివ్వండి

టెక్స్‌టైల్‌ పార్కు కోసం తమ వద్ద సేకరించిన వ్యవసాయ భూములను తమకు అప్పగించాలని, లేదా టెక్స్‌టైల్‌ పార్కు అయినా నిర్మించి ఉద్యోగావకాశాలు కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ‘నిషేధిత భూమికి రెక్కలు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి అక్కడి రైతులు స్పందించారు. హైదరాబాద్‌ టెక్స్‌టైల్‌ పార్కు సొసైటీ పేరుతో కొందరు వ్యక్తులు తమవద్ద నుంచి భూములను తీసుకున్నారని తెలిపారు. తమ భూములు ఇవ్వడానికి నిరాకరిస్తే ఆర్డీవో చేత నోటీసులు జారీ చేయించి మరీ తమ భూములు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము భూములు కోల్పోయినప్పటికీ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తే తమ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగంతో పాటు, తమ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్న ఆశతో భూములను విక్రయించామన్నారు. అప్పట్లో ఎకరాకు రూ.80వేల నుంచి రూ.3 లక్షల వరకూ ఇచ్చారని.. 20 ఏళ్లు గడుస్తున్నా నేటికీ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయలేదని, ఇప్పుడా భూముల ధర రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల దాకా పలుకుతోందని ఆవేదన వెలిబుచ్చారు. ఆ భూములే తమవద్ద ఉండి ఉంటే తమ కుటుంబాలు బాగుపడేవన్నారు. తమ భూములు తమకు అప్పగించాలని కోరుతూ తామంతా రెవెన్యూ అధికారుల చుట్టూ, టెక్స్‌టైల్‌ పార్కు సొసైటీ సభ్యులు చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండట్లేదని వాపోయారు. ఈ అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడాన్ని వారు అభినందించారు.


20 ఏళ్లుగా బాధపడుతున్నాం

భూముల కొనుగోలు కోసమే టెక్స్‌టైల్‌ పార్కు పేరుతో సొసైటీని ఏర్పాటు చేశారు. మమ్మల్ని భయపెట్టి మా భూములు కొన్నారు. ఇన్నేళ్లుగా ఆ పొలాలను పడావు పెట్టారు. భూములు ఇచ్చి తప్పు చేశామని 20 ఏళ్లుగా బాధపడుతున్నాం. ఇప్పుడా భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో కూడా తెలియడం లేదు. దీనిపై మేం ఎవరిని సంప్రదించినా తమకు సంబంధం లేదని దాటవేస్తున్నారే తప్ప పరిష్కారం చూపట్లేదు. టెక్స్‌టైల్‌ పార్కు భూముల వివరాలను అధికారులు రైతులకు తెలపాలి. ఆ పార్కు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

- ఎం.ప్రభాకర్‌, రైతు, చేగూర్‌

Updated Date - Mar 13 , 2025 | 05:40 AM