DA Increase: విద్యుత్తు ఉద్యోగులకు డీఏ పెంపు!
ABN , Publish Date - Jun 22 , 2025 | 05:03 AM
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. విద్యుత్తు సంస్థల్లోని ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులకు కరవు భత్యం (డీఏ) పెంచింది. 1.944 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
1.94% పెంచిన సర్కారు.. 71 వేల మందికి లబ్ధి.. విద్యుత్తు సంస్థలపై నెలకు రూ.11 కోట్ల భారం
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. విద్యుత్తు సంస్థల్లోని ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులకు కరవు భత్యం (డీఏ) పెంచింది. 1.944 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డీఏ 14.074 శాతం ఉండగా.. తాజా పెంపుతో 16.018 శాతానికి చేరింది. పెరిగిన డీఏ 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. జనవరి నుంచి మే దాకా ఐదు నెలల బకాయిలను ఐదు సమాన వాయిదాల్లో చెల్లించనున్నారు. జూన్ నుంచి వేతన రూపంలో డీఏ చేతికి అందనుంది. పెరిగిన డీఏతో 71,417 మందికి లబ్ధి చేకూరనుంది. డీఏ పెంపుతో విద్యుత్తు సంస్థలపై ప్రతి నెలా రూ.11.19 కోట్ల భారం పడనుంది. శనివారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క డీఏ పెంపు దస్త్రంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
మనిషి బతకడానికి గాలి ఎంత అవసరమో పోటీ ప్రపంచంలో ప్రతి పనికీ విద్యుత్తు కూడా అంతే అవసరమని చెప్పారు. 2023 మార్చిలో 15 వేల మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ రాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చిలో 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం, ఉద్యోగులు శ్రమించి విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యుత్తు డిమాండ్ పెరగనుందని, 2029-30 నాటికి రాష్ట్రంలో 26,299మెగావాట్ల డిమాండ్ ఏర్పడనుందని, 2034-35 నాటికి 33,773 మెగావాట్లకు చేరనుందని పేర్కొన్నారు. నూతన హరిత ఇంధన విధానం-2025 తీసుకొచ్చి, 2029-30 నాటికి 20 వేల మెగావాట్ల హరిత ఇంధనం ఉత్పత్తే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని భట్టి సూచించారు.