Share News

Kaleshwaram Project: కాళేశ్వరంపై ఏం చేద్దాం

ABN , Publish Date - Jun 04 , 2025 | 04:12 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఇంకా తేడాలో ఉంది. విజిలెన్స్‌ కమిషన్‌ 17 మందిపై నేరపరమైన, 33 మందిపై శాఖాపరమైన చర్యలు సూచించినా, తుది నిర్ణయం క్యాబినెట్‌ భేటీలో తీసుకోనుంది.

Kaleshwaram Project: కాళేశ్వరంపై ఏం చేద్దాం

విజిలెన్స్‌ నివేదికను అమలు చేయాలా?

ఘోష్‌ రిపోర్టు తర్వాతే ముందుకెళ్లాలా?

బాఽధ్యులపై చర్యలకు సర్కారు మల్లగుల్లాలు

రేపటి క్యాబినెట్‌ భేటీలో ఈ అంశంపై చర్చ

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 మందిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ కమిషన్‌ సిఫారసు చేసింది. మరో 33 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని.. ఏడుగురికి జరిమానాలు విధించాలని సూచించింది. కాళేశ్వరం కట్టాలన్న నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి (2015 ఏప్రిల్‌) మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిపోయేదాకా ఉన్న నీటిపారుదల, ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ కమిషన్‌ ప్రభుతాన్ని కోరింది. సహేతుక కారణాలు లేకుండా ప్రాజెక్టు రీడిజైన్‌ ప్రతిపాదనలను ఆమోదించిన వీరిపై చర్యలకు ఉపక్రమించాలని సూచించింది. అయితే నివేదిక అమలు విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. ఎందుకంటే.. కాళేశ్వరంపై ఇప్పటికే విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ముందు.. శుక్రవారం (జూన్‌ 6న) మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, 9న మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, 11న మాజీ మంత్రి కేసీఆర్‌ హాజరు కావాల్సి ఉంది. వీరు షెడ్యూల్‌ ప్రకారం హాజరైతే... నెలాఖరుకు లేదా జూలై రెండో వారానికల్లా కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. విజిలెన్స్‌ కమిషన్‌ నివేదికను కూడా రిఫరెన్స్‌గా వాడుకోవాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నిర్ణయించింది. ఇప్పటికే కాగ్‌ నివేదికతో పాటు జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (వీ అండ్‌ ఈ) నివేదిక కమిషన్‌కు చేరింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం వైఫల్యానికి కారకులపై చర్యలు తీసుకోవడానికి ఏ నివేదికను ప్రామాణికం చేసుకోవాలనే దానిపై కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది.


అదే జరిగితే..

ప్రధానంగా ప్రజాప్రతినిధులతో పాటు 24 మందికి పైగా అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కాళేశ్వరం కమిషన్‌ నివేదిక సిఫారసు చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదిక ద్వారానే ముందుకెళ్లాల్సి ఉంటుంది. విజిలెన్స్‌ కమిషన్‌ 17 మందిపై నేరారోపణలు చేయగా... అందులో 10 మంది పదవీ విరమణ చేశారు. మిగిలిన ఏడుగురిలో ఇద్దరు ఈ నెలాఖరున రిటైర్‌ కానున్నారు. మిగిలింది ఇక ఐదుగురే. అలాగే.. 33 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ కమిషన్‌ సిఫారసు చేయగా వారిలో 8 మంది రిటైరయ్యారు. 25 మంది సర్వీసులో ఉన్నారు. రిటైర్‌ అయిన ఏడుగురిపై పెన్షన్‌ సవరణ నిబంధనలను అనుసరించి పింఛనులో పెనాల్టీలు విధించాలని సిఫారసు చేసింది. అయితే 33 మందిపై ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌ నమోదు చేసి, విచారణ అధికారులను నియమించాల్సి ఉంటుంది. ఆ విచారణలో తమపై మోపిన అభియోగాల నుంచి వారు బయటపడే అవకాశాలు కూడా లేకపోలేదు. అభియోగాలు నిరూపితమైతే జీవితాంతం ఆర్థిక నష్టం చేకూరనుంది. ఇంక్రిమెంట్‌లు కట్‌ చేస్తే ఆ ప్రభావం వేతనంపై, పదవీ విరమణ చేస్తే పెన్షన్‌పై శాశ్వతంగా ఉంటుంది. కాగా.. గురువారం (జూన్‌ 5న) జరిగే క్యాబినెట్‌ భేటీలో ఒక ఎజెండాగా విజిలెన్స్‌ కమిషన్‌ నివేదిక కూడా రానుంది. దీనికోసం అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. ఏయే తప్పిదాలు చోటుచేసుకున్నాయి? ఎటువంటి చర్యలకు కమిషన్‌ సిఫారసు చేసింది? ఎంత మంది అధికారులు ఈ వ్యవహారంలో బాధ్యులు? వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి, చర్యలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అలాగే జస్టిస్‌ పీసీ ఘోష్‌ విచారణ ప్రక్రియ అంశం కూడా చర్చకు రానుంది. దాంతోపాటు జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ నివేదికపైనా క్యాబినెట్‌ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 04:12 AM