Medigadda Barrage: సరదాగా స్నానానికి వెళ్లి.. గోదావరిలో ఆరుగురి గల్లంతు
ABN , Publish Date - Jun 08 , 2025 | 04:40 AM
మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఇద్దరు సొంత పిల్లలతో సహా ఆరుగురు యువకులు స్నానానికిది ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల గల్లంతయ్యారు, వారి కోసం ఈనాడు రాత్రివరకు సింగరేణి, అగ్నిమాపక, పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారని సమాచారం.
అంతా 18 ఏళ్లు, ఆలోపు వారే..
శనివారం సాయంత్రం మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఘటన
విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసు, సింగరేణి రెస్క్యూ బృందాలు
భద్రాచలంలో గోదావరిలో మునిగి ఎనిమిదేళ్ల బాలుడి మృతి
మహదేవపూర్ రూరల్/భద్రాచలం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): సరదాగా స్నానానికని గోదావరి నదికి వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అంతా 18 ఏళ్లు, ఆలోపు వయసువారే. అందులోనూ తండ్రి కళ్ల ముందే ఇద్దరు కుమారులు కూడా నీళ్లలో కొట్టుకుపోవడం విషాదకరం. మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామి కుమారులు పట్టి మధుసూదన్ (18), పట్టి శివమనోజ్ (15), వారి బంధువు తొగరి రక్షిత్ (13), మహాముత్తారం మండలం కొర్లకుంటకు బొల్లెడ్ల రాంచరణ్ అలియాస్ పండు (17), స్తంభంపల్లి (పీపీ) గ్రామానికి చెందిన పసుల రాహుల్ (18) కలసి శనివారం అంబట్‌పల్లిలో ఓ పెళ్లికి వెళ్లారు. వారికి స్థానికులైన కర్నాల సాగర్ (16), శివమణికంఠ జత కలిశారు. అందరూ మేడిగడ్డ వద్ద గోదావరిలో సరదాగా స్నానం చేసేందుకు వెంకటస్వామి ఆటో తీసుకుని బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అయితే వెంకటస్వామి వారించి, తానే ఆటోను నడుపుకొంటూ గోదావరి వద్దకు తీసుకువచ్చారు. వెంకటస్వామి, శివమణికంఠ ఒడ్డునఉండగా.. మిగతా వారు సాయంత్రం నదిలోకి దిగారు. లోతు ఎక్కువ, ప్రవాహం వేగంగా ఉండటంతో మధుసూదన్, శివమనోజ్, రక్షిత్, సాగర్, రాంచరణ్, రాహుల్ కొట్టుకుపోవడం మొదలుపెట్టారు. వారిని కాపాడేందుకు శివమణికంఠ, వెంకటస్వామి ప్రయత్నించారు. కానీ బ్యారేజీ వద్ద 5 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండటంతో సాఽధ్యపడలేదు. దీనిపై పోలీసులకు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. సింగరేణి, అగ్నిమాపక, పోలీసు రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. అప్పటికీ చీకటిపడటంతో గాలింపు ఆలస్యమవుతోంది.
భద్రాచలం వద్ద ఘటనలో..
భద్రాచలం వద్ద గోదావరిలో మునిగి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన ధనుంజయ్, స్వప్న దంపతులు తమ కుమారుడు అఖిల్‌గౌడ్(8), మరో 13 మందితో కలసి శనివారం భద్రాచలం వచ్చారు. వారంతా గోదావరిలో స్నానం చేస్తుండగా.. అఖిల్ నది లోతును అంచనా వేయలేక నీటిలో మునిగి చనిపోయాడు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి
ఘట్‌కేసర్ రూరల్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): వారాంతపు సెలవులను సరదాగా గడిపేందుకు నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఐటీ ఉద్యోగులు వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్‌లో జరిగింది. ప్రమాదంలో హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూర్‌కు చెందిన భార్గవ్ యాదవ్ (23), సైనిక్‌పురికి చెందిన వర్షిత్ (22)లు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో కారు నడుపుతున్న అల్వాల్‌కు చెందిన ప్రవీణ్ (30)కు తీవ్ర గాయాలయ్యాయి.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..