Share News

Godavari floods: గోదావరి ఉగ్రరూపం

ABN , Publish Date - Aug 29 , 2025 | 04:06 AM

పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన శ్రీరాం సాగర్‌ నుంచి దిగువన భద్రాచలం వరకు భారీగా ప్రవాహం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Godavari floods: గోదావరి ఉగ్రరూపం

  • ఎల్లంపల్లికి అత్యధికంగా 8 లక్షల క్యూసెక్కులు

  • శ్రీశైలానికి 2.38 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • సాగర్‌ నుంచి దిగువకు 2.4లక్షల క్యూసెక్కులు

  • రాష్ట్ర వ్యాప్తంగా 120 చెరువులకు గండ్లు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన శ్రీరాం సాగర్‌ నుంచి దిగువన భద్రాచలం వరకు భారీగా ప్రవాహం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గురువారం మధ్యాహ్నం అత్యధికంగా 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో 8.20లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెట్టారు. సాయంత్రానికి నీటి ప్రవాహం 5,77,398 క్యూసెక్కులకు తగ్గడంతో 38 గేట్ల ద్వారా అంతే స్థాయిలో నీటిని వదులుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పరిశీలిస్తున్నారు. శ్రీరాంసాగర్‌ వరద కాలువ నుంచి 16,365 క్యూసెక్కులు, మానేరు, మూలవాగు నుంచి 79,540 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో మిడ్‌మానేరులో నీటి నిల్వ క్రమేణా పెరుగుతోంది. 27.55 టీంఎంసీలకుగాను ప్రస్తుతం 20.407టీఎంసీల నీరు ఉండడంతో 17గేట్లుఎత్తి 45,635క్యూసెక్కులను లోయర్‌ మానేరు డ్యాంలోకి వదులుతున్నారు. ఎల్‌ఎండీలోకి 56,944 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 16.263 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ఇక, ఎగువన ఉన్న నిజామాబాద్‌ సమీపంలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 1.75లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా...2.83 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెట్టారు.


మరోవైపు.. సింగూరు ప్రాజెక్టుకు 44,650 క్యూసెక్కుల వరద వస్తుండగా.. నాలుగు గేట్లను ఎత్తి 37,685 క్యూసెక్కులను వదులుతున్నారు. మంజీర రిజర్వాయర్‌ నిండు కుండను తలపిస్తోంది. నాలుగు గేట్లను ఎత్తి 50వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. అలాగే, నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు 2.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... అంతే స్థాయిలో నీటిని కిందకు వదిలేస్తున్నారు. కడెం ప్రాజెక్టుకు 44వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఔట్‌ఫ్లో 41 వేలుగా ఉంది. పాల్వంచలోని కిన్నెరసాని, చర్లలోని తాలిపేరు ప్రాజెక్టులకు వరద పోటెత్తగా.. కిన్నెరసాని నుంచి 10వేల క్యూసెక్కులు, తాలిపేరు నుంచి 65వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక, కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గురువారం 2.38లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 9 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,23,119 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాలకు 1.76 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 22గేట్లను ఎత్తి 1,48,323క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టుకు 2,46,410 క్యూసెక్కులు వస్తుండగా.. 26 క్రస్ట్‌ గేట్లను ఎత్తి 2,01,318 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. కుడి కాలువ ద్వారా 9,019 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 33,373 క్యూసెక్కులు తరలిస్తున్నారు. కాగా, మూసీ ప్రాజెక్టుకు 9,956 క్యూసెక్కులు వచ్చి చేరుతుండటంతో 8 గేట్లు ఎత్తారు.

చెరువులకు జలకళ

తాజా వర్షాలతో ములుగు జిల్లాలోని రామప్ప సరస్సు నీటిమట్టం 32 అడుగులకు చేరింది. ఇక, మెదక్‌ పరిధిలో 1800 చెరువులు ఉండగా... రెండు రోజుల్లోనే అన్నీ నిండి...అలుగులు పారుతున్నాయి. రాష్ట్రంలో 120 చెరువులకు గండ్లు పడినట్లు అధికారులు గుర్తించారు.

Updated Date - Aug 29 , 2025 | 04:06 AM