Gender Ratio: మీ జననాలు పడిపోతున్నాయి ‘బిడ్డా’!
ABN , Publish Date - May 11 , 2025 | 05:12 AM
రాష్ట్రంలో లింగ నిష్పత్తిలో వ్యత్యాసం ఏటికేడు పెరుగుతోంది. జననాల్లో ఆడ శిశువుల సంఖ్య తగ్గుతోంది. 2019లో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 953 మంది ఆడ శిశువులు పుడితే 2021లో ఆడ శిశువుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో 922కు పడిపోయింది.
సీఆర్‌ఎస్-2021 నివేదిక వెల్లడి
కొవిడ్‌తో పెరిగిన 15శాతం మరణాలు
మరణాల్లో 76 శాతం 55 ఏళ్లు పైబడిన వారే
శిశు మరణాలు పట్టణాల్లోనే ఎక్కువ
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లింగ నిష్పత్తిలో వ్యత్యాసం ఏటికేడు పెరుగుతోంది. జననాల్లో ఆడ శిశువుల సంఖ్య తగ్గుతోంది. 2019లో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 953 మంది ఆడ శిశువులు పుడితే 2021లో ఆడ శిశువుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో 922కు పడిపోయింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని జనగణన విభాగం సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సీఆర్‌ఎస్) నివేదిక 2021లో వెల్లడించింది. ఆ ఏడాది 2.42 కోట్లమంది పుడితే ఒక్క యూపీ, బిహార్‌లోనే 83 లక్షల మంది (33శాతం) ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లోనే జననాల రేటు ఎక్కువగా ఉంది. 2021లో గ్రామీణ ప్రాంతాల్లో 1,96,166 మంది జన్మిస్తే, పట్టణ ప్రాంతాల్లో 4,15,485 మంది పుట్టారు. ఆ ఏడాది మొత్తం 3.18 లక్షలమంది మగ శిశువులు, 2.93 లక్షల మంది ఆడ శిశువులు జన్మించారు. కాగా 2021లో కొవిడ్ కారణంగా 15.40 శాతం మరణాలు పెరిగాయని సీఆర్‌ఎస్ నివేదిక వెల్లడించింది.
మరణాల్లో మగవారే ఎక్కువ
2021లో గ్రామీణ ప్రాంతాల్లో 1,08,327 మంది చనిపోతే, పట్టణ ప్రాంతాల్లో 1,26,098 మంది మరణించారు. ఆ ఏడాది మొత్తం 2,34,425 చనిపోగా, అందులో 1.35 లక్షల మంది పురుషులు, 98 వేల మంది మహిళలు ఉన్నారు.
నవజాత శిశువుల విషయానికొస్తే గ్రామీణ ప్రాంతాల్లో 1871 మంది కన్నుమూస్తే, పట్టణాల్లో 4410 మంది చనిపోయారు. మొత్తంగా 6281 మంది మరణించారు. తల్లి గర్భంలోనే చనిపోయి పుట్టిన వారు పల్లె ప్రాంతాల్లో 1989 మంది ఉంటే, పట్టణాల్లో 4062 మంది ఉన్నారు.
రాష్ట్రంలో ఆ ఏడాది మొత్తం 2,34,425 మంది చనిపోతే అందులో 55 ఏళ్ల పైబడిన వారు 76 శాతం మంది ఉన్నారు. 35-44 మధ్య వయస్కుల్లో 12 వేలమంది, 45-54 మధ్యవయసు వారిలో 22 వేల మంది, 55-64 మధ్య వారిలో 42 వేల మంది, 65-69 మధ్య వయస్కుల్లో 85 వేలమంది, 70 ఏళ్లు పైబడిన వారిలో 51 వేల మంది మరణించారు.
నవజాత శిశు మరణాలు ఎక్కువగా హైదరాబాద్‌లో సంభవించాయి. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాల్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ జిల్లాల్లో 1805 మంది నవజాత శిశువులు చనిపోతే, పెద్దపల్లి జిల్లాలో 1578 మంది కన్నుమూశారు. గర్భస్థ శిశు మరణాలూ హైదరాబాద్‌లోనే ఎక్కువ జరిగాయి. ఈ మేరకు హైదరాబాద్‌లో 1310, కామారెడ్డిలో 1186, నిజామాబాద్‌లో 1172 మరణాలు సంభవించాయి.
అగ్ర స్థానంలో హైదరాబాద్
తెలంగాణలో ఆ ఏడాది మొత్తం 6.11 లక్షల మంది జన్మించారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాల్లో 95,668 మంది పుడితే, అత్యల్పంగా ములుగు జిల్లాల్లో 3868 మంది పిల్లలు జన్మించారు. జననాల విషయంలో హైదరాబాద్ తర్వాత మేడ్చల్ (35,424), నిజామాబాద్ (44818) సంగారెడ్డి (29,816), వరంగల్ అర్బన్ (27604), నల్లగొండ (27,452), ఖమ్మం (26504) వరుసగా నిలిచాయి. మరణాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఏడాది హైదరాబాద్‌లో 41,451 మంది చనిపోతే, నిజామాబాద్‌లో 16796, వరంగల్ అర్బన్‌లో 16,522 ఖమ్మంలో 11984 మంది మృత్యువాతపడ్డారు.