మా ప్లాట్లు మాకు ఇప్పించండి
ABN , Publish Date - May 03 , 2025 | 04:16 AM
గ్యాంగ్‌స్టర్ నయీం భార్య, అనుచరులు తప్పుడు ధ్రువపత్రాలతో కాజేసిన తమ భూములను ఇప్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీనర్సింహస్వామినగర్ (ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ ) కాలనీ మ్యూచువల్ ఏయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీకి చెందిన దాదాపు 400 మంది ప్రభుత్వాన్ని కోరారు.
యాదాద్రి జిల్లా ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ నగర్ కాలనీ ‘హౌజింగ్ సొసైటీ’ బాధితులు
మల్కాజిగిరి, మే 2 (ఆంధ్రజ్యోతి): గ్యాంగ్‌స్టర్ నయీం భార్య, అనుచరులు తప్పుడు ధ్రువపత్రాలతో కాజేసిన తమ భూములను ఇప్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీనర్సింహస్వామినగర్ (ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ ) కాలనీ మ్యూచువల్ ఏయిడెడ్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీకి చెందిన దాదాపు 400 మంది ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం హైదరాబాద్ మల్కాజిగిరిలో వారు మీడియాతో మాట్లాడారు. ‘యాదాద్రి భువనగిరి జిల్లాలోని సర్వే నంబర్ 722 నుంచి 724, 726 నుంచి 733 వరకు ఉన్న స్థలంలో వేసిన ప్లాట్లను సుమారు 500 మంది కొనుగోలు చేశాం.
రెవెన్యూ రికార్డుల ప్రకారం వీటికి మ్యుటేషన్ జరిగింది. అయుతే 2002-2003లో రికార్డుల్లో మా పేర్లకు బదులు ఇతరుల పేర్లు చేర్చారు. ఆరా తీస్తే మా ప్లాట్లను తప్పుడు ధ్రువపత్రాలతో నయీం భార్య, అనుచరుల పేరిట ఏజీపీఏ ద్వారా బదలాయించుకున్నట్లు తెలిసింది. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత మా భూములను సర్కారు నిషేధిత జాబితాలో పెట్టింది. దీంతో మా ప్లాట్ల కోసం 2008 నుంచి న్యాయ పోరాటం చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిషేధిత జాబితా నుంచి ప్లాట్లను తొలగించి న్యాయం చేయాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.