Share News

CM Revanth Reddy: న్యూయార్క్‌ను మరిపించేలా

ABN , Publish Date - Sep 29 , 2025 | 04:28 AM

భారత్‌ ఫ్యూచర్‌ సిటీని ప్రపంచం అబ్బురపడేలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. న్యూయార్క్‌ను మరిపించే నగరాన్ని కడతామన్నారు. దుబాయి, న్యూయార్క్‌, టోక్యో, సింగపూర్‌ వంటి ప్రాంతాలకు వెళ్లివచ్చి...

CM Revanth Reddy: న్యూయార్క్‌ను మరిపించేలా

  • ఫ్యూచర్‌ సిటీ నిర్మాణం.. ప్రపంచం అబ్బురపడేలా చేస్తాం

  • విదేశాల గురించి ఇంకెన్నాళ్లు మాట్లాడుకుందాం?

  • బయటి దేశాలవారు గొప్పగా చెప్పుకొనేలా చేస్తా

  • పదేళ్లలో ఫార్చ్యూన్‌ కంపెనీలన్నీ ఫ్యూచర్‌ సిటీలోనే

  • రైతులకు అభ్యంతరాలుంటే మాట్లాడుకుందాం

  • రియల్‌ ఎస్టేట్‌ కోసమే అంటూ నాపై విమర్శలు

  • పార్టీల ఉచ్చులో పడి కోర్టులకెళ్లి నష్టపోవద్దు

  • ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్‌ రైలు

  • అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్తు లైన్‌: సీఎం రేవంత్‌రెడ్డి

  • ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన

  • మూసీ పునరుజ్జీవానికి సహకరించాలి

  • పేదలకు అన్యాయం జరిగే పని ఏదీ చేయను

  • ఎన్‌ కన్వెన్షన్‌పై నాగార్జునకు ముందు చెప్పాం.. తర్వాత ఆయనే సహకరించారు

  • బతుకమ్మకుంటకు వీహెచ్‌ పేరు: సీఎం రేవంత్‌

  • అంబర్‌పేటలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం

హైదరాబాద్‌/ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): భారత్‌ ఫ్యూచర్‌ సిటీని ప్రపంచం అబ్బురపడేలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. న్యూయార్క్‌ను మరిపించే నగరాన్ని కడతామన్నారు. దుబాయి, న్యూయార్క్‌, టోక్యో, సింగపూర్‌ వంటి ప్రాంతాలకు వెళ్లివచ్చి అద్భుతంగా ఉన్నాయంటూ ఇంకెన్నాళ్లు గొప్పగా చెప్పుకొంటామని ప్రశ్నించారు. మన ప్రాంతం గురించి బయటి దేశాలవారు గొప్పగా చెప్పుకొనేలా చేయాలన్నదే తన సంకల్పమని ప్రకటించారు. అందుకే భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నిర్మించాలని, ప్రపంచమంతా దీనివైపే చూసేలా చేయాలని తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రానున్న పదేళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్‌ 500 కంపెనీలు ఈ సిటీలో ఉండాలన్నదే లక్ష్యమని చెప్పారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ కార్యాలయానికి, గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్‌-1 నిర్మాణాలకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఫ్యూచర్‌ సిటీని గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఇందుకు ప్రజలందరి సహకారం కావాలి. చిన్న చిన్న సమస్యలేవైనా ఉంటే పరిష్కరించుకుందాం. ప్రభుత్వం ఉదారంగా మిమ్మల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. నేను కూర్చుని మీ సమస్యలను పరిష్కరిస్తాను.


2.jpg

రాజకీయ పార్టీల ఉచ్చులో పడి కోర్టులకు వెళ్లి నష్టపోవద్దు. తక్షణమే మీ సమస్యలను పరిష్కరించాలని మా అధికారులను ఆదేశిస్తున్నాను. అందరికీ న్యాయం చేయాలనేదే మా ప్రయత్నం’’ అని అన్నారు. వచ్చే డిసెంబరులో ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యాలయ భవనాన్ని, స్కిల్‌ యూనివర్సిటీని పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌ తెలిపారు. అప్పుడు నెలకు మూడుసార్లు ఇక్కడికే వచ్చి ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు. ప్రపంచంలో ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినా ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ కార్యాలయంలోనే కూర్చుని మాట్లాడతానని, ప్రపంచాన్ని ఇక్కడికే రప్పిస్తానని అన్నారు. ఫ్యూచర్‌ సిటీపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్‌ ఎస్టేట్‌ కోసమే ఫ్యూచర్‌ సిటీ అంటున్నారని, తనకు ఇక్కడ భూములున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భూములుంటే వాటిని ఎవరైనా లాకర్‌లో పెట్టుకుని తిరుగుతారా? వాటిని దాచిపెడితే దాగేవా? అని ప్రశ్నించారు. అర్థంలేని విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు. ‘‘ఆనాడు కులీ కుతుబ్‌షా హైదరాబాద్‌ నగరానికి అంకురార్పణ చేశారు. నిజాం కాలంలో సికింద్రాబాద్‌ను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన ముందుచూపు ఆలోచన వల్లే నేడు హైటెక్‌ సిటీ, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, సైబరాబాద్‌, సిలికాన్‌ వ్యాలీ, ఔటర్‌ రింగ్‌రోడ్డు సదుపాయాలు వచ్చాయి’’ అని సీఎం అన్నారు. ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఉండాల్సిన అర్హతలన్నీ భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దక్షిణ భారతదేశంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని, ఫ్యూచర్‌ సిటీ నుంచి మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో డ్రై పోర్ట్‌ ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి వరకు బుల్లెట్‌ ట్రైన్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. సింగరేణి కార్పొరేట్‌ కార్యాలయ నిర్మాణానికి ఫ్యూచర్‌ సిటీలో పది ఎకరాలు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబుకు సూచించారు. 2026 డిసెంబరులోగా ఆ కార్యాలయ నిర్మాణం పూర్తిచేసుకునేలా చూడాలన్నారు. మంచి ఆలోచనతో ఈ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, రాజకీయం చేయొద్దని కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భవిష్యత్తు అంతా ఫ్యూచర్‌ సిటీదేనని, ఏఐ టెక్నాలజీతో రూపుదిద్దుకోనున్న ఈ సిటీ ప్రపంచానికే తలమాణికం కాబోతోందని అన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 04:28 AM