Kommidi Suguna: స్వాతంత్య్ర సమర యోధురాలు కొమ్మిడి సుగుణ కన్నుమూత
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:23 AM
నిజాం వ్యతిరేక, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కొరియర్‌గా పనిచేసిన కొమ్మిడి సుగుణ(91) ఇకలేరు.
హైదరాబాద్ సిటీ, జూన్ 17(ఆంధ్రజ్యోతి): నిజాం వ్యతిరేక, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కొరియర్‌గా పనిచేసిన కొమ్మిడి సుగుణ(91) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆమె సోమవారం రాత్రి 11 గంటలకు కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు(సీఆర్) ఫౌండేషన్ వయోధిక ఆశ్రమంలో తుదిశ్వాస విడిచారు. సుగుణ జీవిత సహచరుడు దివంగత శాఖమూరి వెంకట కృష్ణ ప్రసాద్(ఎస్వీకే ప్రసాద్) చెన్నూరు నియోజకవర్గం తొలి ఎమ్మెల్యేగా సేవలందించారు.
సుగుణ స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా బ్రాహ్మణపల్లి. ఆమె చిన్నవయసులోనే భువనగిరి ఆంధ్ర మహాసభలో వలంటీర్‌గా పనిచేశారు. సీపీఐ అనుబంధ మహిళా సమాఖ్య కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రంలో సేవలందించారు. సుగుణ మరణవార్త తెలియగానే అమెరికాలో స్థిరపడిన కుమార్తె డాక్టర్ శోభ, కుమారులు రవి, రమేశ్ బయలుదేరారు. గురువారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సుగుణ అంత్యక్రియలు జరుగుతాయి. ఆమె మృతి పట్ల సీపీఐ నాయకులు సురవరం సుధాకరరెడ్డి, నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని, స్వాతంత్య్ర సమర యోధుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి ఇతర వామపక్ష, ప్రజాసంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు.
మాజీ సర్పంచుల బిల్లులపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు
పెద్ది సుదర్శన్ రెడ్డి
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులతో తమకు సంబంధం లేదని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరమని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.