జూరాల ప్రాజెక్టులో వరద నీటి వృథా
ABN , Publish Date - May 23 , 2025 | 04:06 AM
జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు రెండ్రోజులుగా వచ్చి చేరుతున్న వరద నీరు దిగువకు పారి వృథా అవుతోంది. ప్రాజెక్టు 49, 56 గేట్ల వద్ద స్టాప్‌లాక్ ఎలిమెంట్ పైకి ఎక్కి వరద నీరు దిగువకు పారుతోంది.
పూర్తి కాని రూఫ్ వే తాడు మరమ్మతులు
పలు గేట్ల వద్ద దిగువకు పోతున్న నీళ్లు
అమరచింత, మే 22 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు రెండ్రోజులుగా వచ్చి చేరుతున్న వరద నీరు దిగువకు పారి వృథా అవుతోంది. ప్రాజెక్టు 49, 56 గేట్ల వద్ద స్టాప్‌లాక్ ఎలిమెంట్ పైకి ఎక్కి వరద నీరు దిగువకు పారుతోంది. ఈ నీటి వృథాకు అధికారుల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి, గత ఏడాది వరద సమయంలో జూరాల ప్రాజెక్టులోని 8 గేట్ల వద్ద రోప్ వే తాడు దెబ్బతింది. దీంతో ప్రాజెక్టు అధికారులు ప్రస్తుత వేసవిలో మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. అయితే, అధికారుల అలసత్వం వల్ల ఇప్పటివరకు మూడు గేట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి.
ప్రస్తుతం 40, 49, 56 గేట్ల వద్ద పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో గేటు వద్ద ఐదు స్టాప్ లాక్ ఎలిమెంట్ సెంటర్లను దిగువకు దించి.. ముందు భాగంలోని షెట్టర్లను ఎత్తి రోప్‌వేకి మరమ్మతులు చేస్తున్నారు. అయితే, రెండ్రోజులుగా ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తోంది. గురువారం 8,953 క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ, 40, 49, 56 గేట్ల వద్ద స్టాప్ లాక్ ఎలిమెంట్ గేట్ల పైకి ఎక్కి వరద నీరు దిగువకు పారుతోంది. అధికారులు సకాలంలో పనులు పూర్తి చేసి ఉంటే ఇలా నీరు వృథా అయ్యేది కాదని స్థానిక రైతులు అంటున్నారు. ఈ విషయమై ప్రాజెక్టు అధికారి బీచుపల్లిని వివరణ కోరగా.. గేట్ల వద్ద మరమ్మతులు కొనసాగుతున్నాయని, ఒక్కసారిగా వరద రావడంతో కొన్ని గేట్ల వద్ద నీరు దిగువకు పారుతుందని చెప్పారు.