DGP Jitender: రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృతి
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:54 AM
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మృతి చెందినట్లు సమాచారం అందిందని డీజీపీ జితేందర్ తెలిపారు.
వరదల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాం: డీజీపీ జితేందర్
1500 మందిని రక్షించిన అగ్నిమాపకశాఖ: డీజీ నాగిరెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మృతి చెందినట్లు సమాచారం అందిందని డీజీపీ జితేందర్ తెలిపారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపకశాఖ, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు సమష్టిగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. నీటి ప్రవాహల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి ఎయిర్‌ఫోర్స్ సహాయం తీసుకుంటున్నామని, సిబ్బంది వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహరాన్ని పంపిస్తున్నామని తెలిపారు. దాదాపు రెండు వేల మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. అనేక జిల్లాల్లో రోడ్లు కొట్టుకుపోయాయని, కొన్ని జిల్లాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని తెలిపారు. ప్రత్యామ్నాయ రహదారుల్లో వాహనదారులను పంపిస్తున్నామన్నారు.
చెరువులు అలుగులు పారడం, వాగులు ప్రమాదకరంగా పారుతున్న ప్రాంతాల్లో సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని చెప్పారు. డీజీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని వివరించారు. కాగా, మెదక్ జిల్లా రామాయంపేటలోని ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలలో చిక్కుకున్న 350 మందిని, రామాయంపేట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టల్‌లో చిక్కుకున్న 80 మందిని, కామారెడ్డిలోని జీఆర్ కాలనీలో నీటిలో చిక్కుకున్న 70 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో స్పందించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపుగా 1500 మంది బాధితుల్ని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించినట్లు అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు. వరద, ముంపు ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సేవలందిస్తారని పేర్కొన్నారు.