కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా
ABN , Publish Date - May 19 , 2025 | 03:52 AM
గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. అగ్నిమాపక శాఖ వద్ద అత్యాధునిక పరికరాలు లేవని వ్యాఖ్యానించడం బాధాకరం.

అగ్నిమాపక శాఖ సిబ్బంది ఆలస్యంగా వెళ్లారనడం సరికాదు
షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగింది: అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి
హైదరాబాద్ సిటీ/చార్మినార్, మే 18 (ఆంధ్రజ్యోతి): ‘‘గుల్జార్‌హౌ్‌సలో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. అగ్నిమాపక శాఖ వద్ద అత్యాధునిక పరికరాలు లేవని వ్యాఖ్యానించడం బాధాకరం. సరైన సమయంలో అగ్నిమాపక సిబ్బంది రాలేదనడం అవాస్తవం. అగ్ని ప్రమాదం జరిగినట్లు ఉదయం 6.16 గంటలకు సమాచారం అందగా.. వెంటనే మొఘల్‌పురా అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసి ఘటనా స్థలానికి పంపించాం. తర్వాత 11 ఫైరింజన్లు సహా మొత్తం 87 మంది ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
నేనే స్వయంగా వచ్చి ఘటనను పరిశీలించా’’ అని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. భవనం మొదటి అంతస్తుకు వెళ్లే దారిలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరగడమే ప్రమాదానికి కారణమని తెలిపారు. మొదటి అంతస్తులో తీవ్రంగా గాయపడి, స్పృహ కోల్పోయిన 17 మందిలో అందరూ చనిపోవడం బాధాకరమన్నారు. రెండో అంతస్తు నుంచి నలుగురిని రక్షించగలిగామని తెలిపారు. ప్రమాదం జరిగిన భవనం చాలా పాతదని, ఫైర్ సేఫ్టీ నిబంధనలేవీ పాటించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని ఆయన వివరించారు.