Share News

Fertility Fraud Secunderabad: ఫర్టిలిటీ సెంటర్‌లో ఘరానా మోసం

ABN , Publish Date - Jul 27 , 2025 | 04:06 AM

సికింద్రాబాద్‌లోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం వచ్చే దంపతుల వీర్యం, అండాలను కాకుండా.

Fertility Fraud Secunderabad: ఫర్టిలిటీ సెంటర్‌లో ఘరానా మోసం

  • రెండేళ్ల తర్వాత వెలుగులోకి దారుణం

  • బాబుకు క్యాన్సర్‌ రావడంతో అనుమానం

  • డీఎన్‌ఏ పరీక్షల్లో బట్టబయలైన మోసం

  • సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌పై దంపతుల ఫిర్యాదు

  • పోలీసులు, వైద్యులు, అధికారుల తనిఖీలు

  • లైసెన్స్‌ లేకుండా కొనసాగుతున్న కేంద్రం

  • పోలీసుల అదుపులో డాక్టర్‌ నమ్రత! సంతాన సాఫల్యం మాటున దంద దంపతులను మోసం చేస్తున్న కేంద్రాలు

అడ్డగుట్ట/హైదరాబాద్‌ సిటీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌లోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సంతానం కోసం వచ్చే దంపతుల వీర్యం, అండాలను కాకుండా.. దాతల నుంచి సేకరించిన వీర్యంతో సంతానం కలిగిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో.. బాధిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్యాధికారులు ఆ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. పోలీసుల కథనం ప్రకారం.. సంతానం లేని ఓ జంట రెండేళ్ల క్రితం సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ సెంటర్‌ను ఆశ్రయించింది. వారిని పరీక్షించిన వైద్యులు.. భర్త వీర్యకణాలతో ఐవీఎఫ్‌ విధానం ద్వారా మహిళ గర్భం దాల్చేలా చేశారు. ఆ తర్వాత మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో.. ఆ దంపతులు పరీక్షలు చేయించారు. ఫలితాల్లో బాబుకు క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది. తమ కుటుంబంలో ఎవరికీ లేని వ్యాధి బాబుకు ఎందుకు వచ్చిందో అర్థం కాని ఆ దంపతులు.. అనుమానంతో సృష్టి సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకులను నిలదీశారు. వారు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో.. బాధిత దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాబుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా.. వీర్యదాత ద్వారా ఆ బిడ్డ జన్మించినట్లు తేలింది. దాంతో పోలీసులు సదరు ఫర్టిలిటీ కేంద్రంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.


ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాల్‌ నేతృత్వంలోని గోపాలపురం పోలీసుల బృందం.. వైద్యాధికారులు, సికింద్రాబాద్‌ ఆర్డీవో, మారేడుపల్లి తహసీల్దార్‌ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఏడేళ్ల క్రితమే ఈ కేంద్రాన్ని సీజ్‌ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా.. రహస్యంగా దందాను నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిగ్గుతేల్చారు. ఫర్టిలిటీ సెంటర్‌ డాక్టర్‌ నమ్రత తమ కేంద్రంపై కేసు నమోదవ్వగానే విజయవాడలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయారు. దీంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విజయవాడలోని గురునానక్‌ కాలనీకి చేరుకుని, పటమట పోలీసుల సహకారంతో నమ్రతను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఆమెకు నెల్లూరు, విజయవాడ, విశాఖపట్టణాల్లో కూడా ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నట్లు గుర్తించి, అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడా తనిఖీలు నిర్వహించారు. విశాఖలోని జిల్లాపరిషత్‌ జంక్షన్‌లో ఉన్న సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ సెంటర్‌పైనా హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. సెంటర్‌ ఇన్‌చార్జి సీహెచ్‌ కల్యాణితోపాటు.. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడి సెంటర్‌ను 2018లో ఏర్పాటు చేయగా.. 2023 నుంచి రెన్యూవల్‌ చేసుకోలేదని విశాఖ వైద్యాధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ సెంటర్‌లో ఖరీదైన వైద్యపరికరాలున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. మూడంతస్తుల భవనంలో ఒక అంతస్తులో డాక్టర్‌ నమ్రత ఇల్లు, మరో అంతస్తులో ఆమె కుమారుడి(లాయర్‌)కి సంబంధించిన కార్యాలయం, ఇంకో అంతస్తులో ఫర్టిలిటీ సెంటర్‌ కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు.. పలు రాష్ట్రాల దంపతులకు ఇక్కడ వైద్యం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


భారీగా వీర్యం నిల్వలు?

పోలీసులు సృష్టి సంతాన సాఫల్య కేంద్రం నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఫ్రీజర్‌లో భారీ ఎత్తున వీర్యం నిల్వలున్నట్లు గుర్తించారు. ఆస్పత్రి కంప్యూటర్‌ హార్డ్‌డి్‌స్కను సీజ్‌ చేసి, మరింత సమాచారాన్ని సేకరించడానికి అందులోని డాటాను విశ్లేషిస్తున్నారు. వీడియో రికార్డింగ్‌ మధ్య సోదాలు, తనిఖీలను కొనసాగించారు. ఈ క్రమంలో పలువురు సిబ్బంది వాంగ్మూలాలను సేకరించారు. తాము ఆ కేంద్రంలో వైద్యం చేయడం లేదని డాక్టర్‌ నమ్రత చెప్పగా.. లేదులేదు.. వైద్యం కొనసాగుతోందని సిబ్బంది వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం..! అటు విశాఖపట్నం సెంటర్‌లో కూడా భారీగా వీర్యం నిల్వలు లభ్యమైనట్లు సమాచారం. కాగా.. పోలీసులు, వైద్యులు, రెవెన్యూ అధికారుల సంయుక్త తనిఖీల వివరాలను ఆదివారం వెల్లడిస్తామని డీసీపీ రష్మీ వెల్లడించారు. ఈ కేంద్రంలో అక్రమంగా ఐవీఎఫ్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోందని, జిల్లా వైద్యాధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ప్రాథమిక విచారణ పూర్తయ్యాక.. మీడియాకు వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.


ఈవార్తలు కూడా చదవండి..

పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 04:06 AM