Revanth Reddy: ముఖాముఖిలో ముఖ్యమంత్రికి రైతుల విజ్ఞప్తి
ABN , Publish Date - Jun 17 , 2025 | 03:45 AM
కూలీల కొరత ఉందని.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, ఉద్యాన పంటల సాగు కోసం డ్రిప్ (సూక్ష్మ సేద్యం) యూనిట్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి రైతులు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): కూలీల కొరత ఉందని.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, ఉద్యాన పంటల సాగు కోసం డ్రిప్ (సూక్ష్మ సేద్యం) యూనిట్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి రైతులు విజ్ఞప్తి చేశారు. సబ్సిడీ పథకాలను పునరుద్ధరించాలన్నారు. అలాగే నూనె గింజలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలు సాగు చేసేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కోరారు. సోమవారం జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో రైతులతో ముఖాముఖిలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌లో కొందరు, సభలో ప్రత్యక్షంగా కొందరు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. కూరగాయలు, ద్రాక్ష తోటలు, వాణిజ్య పంటలు సాగు చేస్తే ప్రభుత్వం కచ్చితంగా సహకరిస్తుందన్నారు.
రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు సలహాలు, సూచనలిస్తుండటంతో ఎంతో మేలు జరుగుతోందని.. ఇప్పటివరకు 58 వారాలు, 58 ఎపిసోడ్లు నిర్వహిస్తే అన్నింటికి హాజరయ్యానని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘ఖమ్మం జిల్లా వాళ్లు చాలా హుషారున్నరు. ఆర్థిక శాఖను మీరే తీసుక పోయిండ్లు. రెవెన్యూ శాఖను మీరే తీసుకెళ్లిండ్లు. వ్యవసాయశాఖను మీరే తీసుకెళ్లిండ్లు. కీలకమైన మూడు శాఖలు మీ జిల్లాకే ఇచ్చినం’ అని అన్నారు. మహబూబాబాద్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు మాట్లాడిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. యువకులు కండలు పెంచుకోవటానికి జిమ్‌కు వెళ్తున్నారని, జొన్నరొట్టె తిని ఎవరి బట్టలు వాళ్లు ఉతుక్కుంటే సిక్స్ ప్యాక్ బాడీ తయారవుతుందని వ్యాఖ్యానించారు. కొడంగల్, అచ్చంపేటలో పండించే కందిపప్పు, దోసకాయ వండుకొని తింటే చికెన్, మటన్ కంటే మజా వస్తుందని చెప్పారు.