Share News

Farmers Trapped by Hybrid: రైతుకు బహుళ కుచ్చుటోపీ

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:38 AM

విత్తన పంటలు సాగు చేసే రైతులను బహుళ జాతి విత్తనోత్పత్తి సంస్థలు తెలివిగా బురిడీ కొట్టిస్తున్నాయి.

Farmers Trapped by Hybrid: రైతుకు బహుళ కుచ్చుటోపీ

  • మెదక్‌ జిల్లాలో వేలాది ఎకరాల్లో విత్తన వరి సాగు

  • ఎకరాకు రూ.47,500 ఖర్చు

  • ఇచ్చేది క్వింటాల్‌ ధాన్యానికి 9 వేలే

  • ఒకవేళ దిగుబడి రాకుంటే రూ.75వేలు ఇస్తామని ఒప్పందం

  • కోతలయ్యాక కంపెనీల ఎగనామం

మెదక్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): విత్తన పంటలు సాగు చేసే రైతులను బహుళ జాతి (విత్తనోత్పత్తి) సంస్థలు తెలివిగా బురిడీ కొట్టిస్తున్నాయి. సీజన్‌ ప్రారంభంలోనే గ్రామాలకొచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులు.. మేల్‌, ఫిమేల్‌ (విత్తన ధాన్యం) వరి సాగుతో మంచి లాభాలుంటాయని నమ్మించి చివర్లో కుచ్చుటోపీ పెడుతున్నారు. తమ విత్తనాలు సాగుచేస్తే, క్వింటాల్‌ ధాన్యం రూ.9,000లకు కొంటామని, దిగుబడి రాకపోయినా రూ.75,000 పరిహారం చెల్లిస్తామని చెబుతున్నారు. విత్తనాల పంట సాగులో ఎకరాకు 9/10 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. రూ. 81,000-రూ.90,000 ఆదాయం ఉంటుంది. కానీ, విత్తన పంట సాగుపై అవగాహన లేక.. కాలం కలిసి రాక అనుకున్న మేరకు దిగుబడి రాని రైతులు నష్టపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభం లో ఆరేడు విత్తన కంపెనీల ప్రతినిధులు.. మెదక్‌ జిల్లాలో 5090 ఎకరాల్లో రైతులతో ఒప్పందం చేసుకోగా, మౌఖికంగా మరో 20 వేల ఎకరాల్లో రైతులు విత్తన వరిసాగు చేశారు. విత్తన పంటల సాగు అన్నదాతలకు కాస్త ఖర్చే. ఎకరాకు రూ.47,500లు అన్నదాతలే భరించాలి. కంపెనీ రూ.5,500 (కలుపు తీతకు రూ.3,000, పంట కోతకు ఎకరాకు రూ.2,500) ఇచ్చి చేతు లు దులిపేసుకుంటుంది. పంటల నూర్పిడి తర్వాత.. దిగుబడి ఎంతొచ్చినా క్వింటాల్‌ ధాన్యానికి రూ.9,000మాత్రమే ఇస్తామని ఆయా కంపెనీల ప్రతినిధులు తేల్చేయడంతో అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకెళ్తే.. ఇది ప్రైవేటు వ్యవహారమని తప్పుకుంటున్నారు. ఇటీవల చేగుంట మండలం పోలంపల్లి రైతులు.. పురుగు మందు డబ్బాలతో అగ్రిమెంట్లు చేసుకున్న కంపెనీ ప్రతినిధి వద్దకెళ్లి తెచ్చుకుని ఆత్మహత్య చేసుకుంటామంటే.. మరో అవకాశం ఇవ్వండని వారిని బతిమాలుకున్నాడు. చిన్న శంకరంపేటలో మరో సీడ్స్‌ కంపెనీ ఆర్గనైజర్‌ మహేష్‌ గౌడ్‌పై సోమవారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంకొక సీడ్స్‌ సంస్థ ఆర్గనైజర్‌ వెంకటేశం... 250 ఎకరాల భూమి గల రైతులతో అగ్రిమెంట్‌ చేయించాడు. కానీ, కంపెనీ యాజమాన్యం రూ.55 వేలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో ఒప్పందం ప్రకారం రూ.80 వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన అన్నదాతలు.. వెంకటేశంపై చిన్నశంకరంపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


డబ్బులిమ్మంటే వాయిదాలేస్తున్నాడు

‘పంట దిగుబడి రాకున్నా ఎకరాకు రూ.75 వేల పరిహారం చెల్లించడానికి ఒక సీడ్స్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నా. నేను 14 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని పంటలను సాగు చేశా. కానీ, అగ్రిమెంట్‌ ప్రకారం డబ్బు చెల్లించమంటే ఆ సంస్థ ప్రతినిధి వాయిదాలేస్తున్నాడు. అప్పుల భారం మోయలేకపోతున్నా.

- రవి కుమార్‌, రైతు,

మాచవరం, మెదక్‌ మండలం

Updated Date - Aug 12 , 2025 | 04:38 AM