Farmers Protest: ఎండిన పంట.. రైతు గుండె మంట
ABN , Publish Date - Mar 14 , 2025 | 05:59 AM
యాసంగిలో సాగు చేసిన పంటలు తడి అందక ఎండిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే ఇలా ఎండిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయతతో రైతుల గుండె మండుతోంది.

పురుగు మందు డబ్బాలతో నిరసన
వరి చేనులో పశువుల్ని మేపిన రైతు
జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఆందోళన
జనగామ రూరల్, చిన్నగూడూరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో సాగు చేసిన పంటలు తడి అందక ఎండిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే ఇలా ఎండిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయతతో రైతుల గుండె మండుతోంది. ఈ తరుణంలో జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో రైతులు నిరసనలకు దిగారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నీరందించాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా జనగామ మండలం గానుగుపహాడ్, ఎర్రగోల్లపహాడ్, ఎర్రకుంట తండా, మరిగడి, వడ్లకొండ గ్రామాల రైతులు గురువారం జనగామ-నర్మెట రహదారి గానుగుపహాడ్‌స్టేజి వద్ద నిరసన తెలిపారు. రోడ్డపై టైర్లు కాల్చి, పురుగుల మందు డబ్బాలతో రాస్తారోకో చేపట్టారు.
బీజేవైఎం నాయకుడు శానబోయిన మహిపాల్ ముదిరాజ్, రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి బొమ్మకూర్ రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 15 నుంచి బొమ్మకూరు రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అలాగే, మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం విస్సంపల్లికి చెందిన రైతులు తుమ్మల చెరువు కింద వరి సాగు చేశారు. కొద్ది రోజులుగా చెరువు, బావుల్లో నీరు లేక పంట ఎండిపోయింది. దీంతో ఆవేదన చెందిన రైతులు గురువారం పంట చేనులో పశువులను మేపుతూ నిరసన వ్యక్తం చేశారు.