Share News

Farmers Protest: మా భూములు మాకివ్వండి!

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:28 AM

ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆశపెట్టి తమ సాగు భూములను తక్కువ ధరకు కొనుగోలుచేశారని.. ఏళ్లు గడిచినా ఇప్పటిదాకా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ సిద్ధం చేయలేదని రైతులు కన్నెర్ర చేశారు.

Farmers Protest: మా భూములు మాకివ్వండి!

  • టెక్స్‌టైల్‌ పార్క్‌ వద్ద రైతుల తిరుగుబాటు

  • గేటు తాళాలు పగులగొట్టి ప్రాంగణంలోకి దూసుకువెళ్లిన రైతులు

  • తమకూ న్యాయం చేయాలంటూ సొసైటీ సభ్యుల డిమాండ్‌

షాద్‌నగర్‌, నందిగామ జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆశపెట్టి తమ సాగు భూములను తక్కువ ధరకు కొనుగోలుచేశారని.. ఏళ్లు గడిచినా ఇప్పటిదాకా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ సిద్ధం చేయలేదని రైతులు కన్నెర్ర చేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చెగూరు రెవెన్యూ శివారులోని హైదరాబాద్‌ హైటెక్‌ టెక్స్‌టైల్‌ పార్కు గేటు తాళాలు పగులగొట్టి తమ నుంచి సేకరించిన భూముల్లోకి చొచ్చుకెళ్లారు. రైతులు, సొసైటీ సభ్యులు ఆదివారం పెద్ద ఎత్తున ఽఆందోళన చేపట్టారు. తమ భూములు అప్పగించాలని, లేదంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళనకు దిగారు. ఈ టెక్స్‌టైల్‌ పార్కులో జరుగుతున్న అక్రమాల గురించి ‘ఆంధ్రజ్యోతి’ మార్చి 12న వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఉమ్మడి కొత్తూరు మండలం చెగూరు- నర్సప్పగూడ మధ్యన టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు కోసం హైదరాబాద్‌ హైటెక్‌ టెక్స్‌టైల్‌ పార్కు పేరిట 2000 సంవత్సరంలో సొసైటీని ఏర్పాటు చేశారు. ఇందులో 108 మంది సభ్యులను చేర్చి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి రైతుల నుంచి 142 ఎకరాలను కొనుగోలు చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని సొసైటీ సభ్యులు హామీ ఇచ్చారు.


కానీ ఇప్పటిదాకా ఆ స్థలంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమను ఏర్పాటు చేయకపోవడంతో సేకరించిన భూములను రూ.20కోట్లకు ఇతరులకు అమ్మేందుకు సొసైటీలోని కొందరు సభ్యులు ఓ వ్యక్తితో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ భూములను తమకు అప్పగించాలనే డిమాండ్‌తో ఆందోళన చేపట్టారు. లేదంటే టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేసి తమకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా కమిటీ చైర్మన్‌ ఉప్పల నర్సయ్య, ఘన్‌ శ్యాం సరోజ్‌ మోసం చేశారంటూ సొసైటీలో ఉన్న సభ్యులు టెక్స్‌టైల్‌ పార్కు వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీలోని సభ్యులు మామిడాల సురేందర్‌తో పాటు పలువురు సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ తాము కూడా హైదరాబాద్‌ హైటెక్‌ టెక్స్‌టైల్‌ పార్కులో పెట్టుబడులు పెట్టామన్నారు. తమకు తెలియకుండానే టెక్స్‌టైల్‌ పార్కు భూములను ఓ వ్యక్తికి అమ్మేందుకు సిద్ధమయ్యారని, రూ.20 కోట్లకు అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని తెలిపారు. వాటికి కావాల్సిన అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయన్నారు. విషయం తెలిసి న్యాయస్థానాలను ఆశ్రయించినా న్యాయం దక్కలేదని, ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తమకు న్యాయం జరగలేదని, కనీసం కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు టెక్స్‌టైల్‌ పార్కు వద్ద పోలీసు వేషధారణలో వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది హల్‌చల్‌ చేశారు. రైతులు, సొసైటీ సభ్యులు చేస్తున్న ధర్నాను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తూ అక్కడ ఉన్నవారిని తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు.

Updated Date - Jun 23 , 2025 | 04:28 AM