Fancy Numbers: ఫ్యాన్సీ నెంబర్ల ఫీ భారీగా పెంపు!
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:09 AM
కోరుకున్న కారు కొనుగోలు చేశాక కావాల్సిన నెంబరు కోసం వాహనదారులు ప్రయత్నిస్తుంటారు. ఫ్యాన్సీ నెంబరు కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకడుగు వేయరు
రవాణా శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ
ఇకపై 9999 కావాలంటే లక్షన్నర కట్టాల్సిందే
హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): కోరుకున్న కారు కొనుగోలు చేశాక కావాల్సిన నెంబరు కోసం వాహనదారులు ప్రయత్నిస్తుంటారు. ఫ్యాన్సీ నెంబరు కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకడుగు వేయరు. ఇలా ఫ్యాన్సీ నెంబరు కోసం ప్రయత్నించే వాహనదారుల్ని లక్ష్యంగా చేసుకుని రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాటి ధరలు పెంచుతూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపు ద్వారా రవాణా శాఖకు ఏటా సుమారు రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ధరల పెంపుతో రవాణా శాఖకు ఈ ఆదాయం భారీగా పెరగనుంది. 1, 9, 6666, 9999, 8055 ఇలా సుమారు 100 వరకు ఫ్యాన్సీ నెంబర్లకు ఇకపై ప్రాథమిక ధర పెంచుతున్నారు. దానిపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించిన తర్వాత త్వరలోనే పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
అత్యంత ఫ్యాన్సీ నెంబరుగా వాహనదారులు భావించే 9999 నెంబరుకు ఇప్పటి వరకు ప్రాథమిక ధర(వేలం కోసం) రూ. 50 వేలు వసూలు చేసేవారు. ఆ మొత్తం చెల్లించి ఆన్‌లైన్ వేలంలో ఎవరు ఎక్కువ మొత్తానికి పాడుకుంటే వారికే ఆ నెంబరు కేటాయిస్తున్నారు. ఇకపై ఈ నెంబరుకు ప్రాథమిక ధరలక్షన్నరగా సవరించారు. 6666 నెంబరుకు ప్రస్తుతం రూ. 30 వేలు ప్రాథమిక ధరకాగా దాన్ని రూ. 70 వేలకు పెంచుతున్నారు. అలాగే ఫ్యాన్సీ నెంబర్లకు ప్రస్తుతం ఐదు స్లాబులు ఉన్నాయి. నెంబరును బట్టి ప్రాథమికధర వసూలు చేస్తున్నారు. రూ. 50 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేలుగా ప్రస్తుతం ఉన్న ఈ ఐదు స్లాబుల్ని ఏడుకు పెంచారు. రూ. 1.50 లక్షలు, రూ. లక్ష, రూ. 50 వేలు, రూ. 40 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 6 వేలుగా వాటిని నిర్ణయించారు.