Ganesha idol immersion: 5 తులాల బంగారు గొలుసుతో విగ్రహ నిమజ్జనం!
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:53 AM
ఇంట్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని, మెడలో 5 తులాల బంగారు గొలుసు వేసి పూజలు చేసిన ఆ కుటుంబసభ్యులు.. ఆ గొలుసు సహా విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. తర్వాత విషయం తెలిసి గగ్గోలు పెట్టారు.
తర్వాత విషయం తెలిసి కంగారుపడ్డ కుటుంబసభ్యులు
తుర్కయాంజాల్‌లో ఘటన.. రంగంలోకి మునిసిపల్ సిబ్బంది
గణేశ్ విగ్రహాన్ని వెలికి తీసి మెడలోని గొలుసు అందజేత
హయత్‌నగర్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని, మెడలో 5 తులాల బంగారు గొలుసు వేసి పూజలు చేసిన ఆ కుటుంబసభ్యులు.. ఆ గొలుసు సహా విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. తర్వాత విషయం తెలిసి గగ్గోలు పెట్టారు. తుర్కయంజాల్‌లోని మాసబ్ చెరువు వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. వనస్థలిపురం హస్తినాపురం హెచ్‌పీ పెట్రోల్ బంకు వెనుక ఉన్న హోం ప్రసాద్ అపార్టుమెంటు ప్లాటు నంబర్ 302లో ఉంటున్న గిరిజ, ఆమె కుటుంబసభ్యులు పండుగ రోజు ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించుకున్నారు. ఆ సమయంలో ఇంట్లోని 5 తులాల బంగారు గొలుసును వినాయకుడి మెడలో వేశారు. మూడు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శనివారం విగ్రహాన్ని తుర్కయాంజాల్ మాసబ్ చెరువులో నిమజ్జనం చేశారు.
తర్వాత చేతులు కడుక్కొని చెరువు కట్టపైకొచ్చారు. అంతలో కుటుంబంలో ఒకరు బంగారు గొలుసు సంగతి గుర్తుచేయడంతో ఆందోళన చెందిన బాధితులు తుర్కయంజాల్ మునిసిపాలిటీ సిబ్బందికి విషయం చెప్పారు. వెంటనే సిబ్బంది ఎక్స్‌కవేటర్ తీసుకొచ్చి విగ్రహాన్ని బయటకు తీసి.. మెడలో ఉన్న గొలుసును బాధిత కుటుంబానికి అందజేశారు. తమ సొత్తును మళ్లీ తమకు వినాయకుడే ఇప్పించాడని ఆ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.