Clash Over Love Marriage: యువతి ప్రేమ వివాహం.. దారుణానికి ఒడిగట్టిన తండ్రీకొడుకులు..
ABN , Publish Date - Nov 03 , 2025 | 07:53 PM
సంగారెడ్డి జిల్లా ఝురాసంగం మండలంలోని కక్కర్‌వాడలో దారుణం చోటుచేసుకుంది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో ఓ తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. కొడుకుతో కలిసి కూతురి మామపై దాడి చేశాడు. ఇంటిని తగలబెట్టాడు.
కూతురు తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కూతురి భర్త ఇంటికి నిప్పు పెట్టాడు. అంతటితో ఆగకుండా కూతురి మామపై కొడుకుతో కలిసి దాడి చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఝురాసంగం మండలంలోని కక్కర్‌వాడకు చెందిన గొల్ల విఠల్ కూతురు అదే గ్రామానికి చెందిన బోయిన నగేష్ ప్రేమించుకున్నారు.
ప్రేమ సంగతి యువతి ఇంట్లో వారికి తెలిసింది. వారు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం ఆమె తండ్రి గొల్ల విఠల్‌కు తెలిసింది. దీంతో అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. కొడుకు పాండుతో కలిసి నరేష్ ఇంటి దగ్గరకు వెళ్లాడు. నరేష్ తండ్రిపై ఇద్దరూ కలిసి విచక్షణా రహితంగా దాడి చేశారు.
అనంతరం వారి ఇంటికి నిప్పు పెట్టారు. స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఇంటి దగ్గరకు చేరుకున్నారు. మంటల్ని ఆర్పేశారు. ఈ సంఘటనపై నగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రీకొడుకులపై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
కార్తీక పౌర్ణమి నుంచి ఈ రాశులకు గజకేసరి యోగం..
ప్రియురాలితో ఏకాంతంగా భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..