Share News

రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు!

ABN , Publish Date - Jun 13 , 2025 | 04:35 AM

సీసీ రోడ్డు నిర్మించకున్నా కాంట్రాక్టు సంస్థకు బిల్లులు చెల్లించిన చార్మినార్‌ జోన్‌ పరిధిలోని సంతోష్‌‌నగర్‌ (ఇంజనీరింగ్‌ డివిజన్‌-7) ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగుతోన్న ఏకాంబరంపై సస్పెన్షన్‌ వేటు పడింది.

రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు!

  • ఈఈని సస్పెండ్‌ చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

  • విధుల నుంచి ఔట్‌ సోర్సింగ్‌ ఏఈ తొలగింపు

  • ఐఎస్‌ సదన్‌ కార్పొరేటర్‌ ఫిర్యాదుతో విచారణ

  • బోగస్‌ బిల్లులకు నిధులిచ్చినట్లు తేలడంతో చర్యలు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): సీసీ రోడ్డు నిర్మించకున్నా కాంట్రాక్టు సంస్థకు బిల్లులు చెల్లించిన చార్మినార్‌ జోన్‌ పరిధిలోని సంతోష్‌‌నగర్‌ (ఇంజనీరింగ్‌ డివిజన్‌-7) ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగుతోన్న ఏకాంబరంపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఐఎస్‌ సదన్‌ డివిజన్‌లో రోడ్డు నిర్మించకుండా బిల్లులు చెల్లించారన్న ఫిర్యాదుపై విజిలెన్స్‌ విచారణ జరిపించిన కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ గురువారం ఈఈపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈఈ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఎన్‌ఎంఆర్‌)గా పని చేస్తున్న ఎస్‌ఎంఆర్‌ అన్సారీని విధుల నుంచి తొలగించాలని పాలనా విభాగం అదనపు కమిషనర్‌ను ఆదేశించారు.


ఐఎస్‌ సదన్‌లోని సింగరేణి కాలనీ వాంబే ఇళ్ల వద్ద సీసీ రోడ్డు నిర్మించకుండా రూ.9లక్షలు చెల్లించారని డివిజన్‌ కార్పొరేటర్‌ శ్వేత గత నెల 21న కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కర్ణన్‌ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్‌ అధికారుల విచారణలో ఈఈ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సీసీ రోడ్డు నిర్మించకున్నా పనులు చేసినట్టు బోగస్‌ బిల్లులు పెట్టినా ఆమోదించారని తేలింది. కమిషనర్‌కు కార్పొరేటర్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిన కాంట్రాక్టు ఏజెన్సీ, స్థానిక ఇంజనీరింగ్‌ అధికారులు అదే రోజు రాత్రి ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈఈ ఏకాంబరంను సస్పెండ్‌ చేసిన కమిషనర్‌.. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లవద్దని ఆదేశాల్లో స్పష్టంచేశారు. రోడ్డు నిర్మించకుండానే... బిల్లులు సమర్పించిన కాంట్రాక్టు సంస్థను ఇప్పటికే బ్లాక్‌ లిస్టులో పెట్టారు.

Updated Date - Jun 13 , 2025 | 04:35 AM