Share News

Shadnagar: గంజాయి కొట్టేసి, అమ్మాలని చూసి.. ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ జైలుపాలు

ABN , Publish Date - Jun 06 , 2025 | 03:59 AM

జల్సాలకు అలవాటుపడి, డబ్బు కోసం అడ్డదారి తొక్కిన ఓ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ విధి నిర్వహణలో చేతి వాటం ప్రదర్శించాడు.

Shadnagar: గంజాయి కొట్టేసి, అమ్మాలని చూసి.. ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ జైలుపాలు

  • స్టేషన్‌ పరిధిలో పట్టుబడిన గంజాయి నుంచి కిలోన్నర తస్కరణ

  • బంధువు ద్వారా అమ్మకానికి యత్నం

  • ఇద్దరిని అరెస్టు చేసిన షాద్‌నగర్‌ పోలీసులు

షాద్‌నగర్‌ రూరల్‌/తాండూరు, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): జల్సాలకు అలవాటుపడి, డబ్బు కోసం అడ్డదారి తొక్కిన ఓ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ విధి నిర్వహణలో చేతి వాటం ప్రదర్శించాడు. తమ స్టేషన్‌ పరిధిలో పట్టుబడిన గంజాయి నుంచి కొంత మొత్తాన్ని కొట్టేసి, బంధువు ద్వారా దానిని అమ్మాలని చూసి పోలీసులకు చిక్కాడు. మరో నెల రోజుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి అనగా కటకటాలపాలయ్యాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గులాం సుల్తాన్‌ అహ్మద్‌(52) అనే వ్యక్తి తాండూరు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.


తాండూరు ఎక్సైజ్‌ పోలీసులు తమ స్టేషన్‌ పరిధిలో పట్టుబడిన గంజాయిని దహనం చేసేందుకు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీప నందిగామ వద్దకు తరలిస్తుండగా ఓ గంజాయి ప్యాకెట్‌(కిలోన్నర)ను గులాం సుల్తాన్‌ దొంగలించాడు. ఆ ప్యాకెట్‌ను తన బంధువు, షాద్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ అంజాద్‌(32)కు అప్పగించిన సుల్తాన్‌.. దానిని విక్రయించమని చెప్పాడు. అయితే, షాద్‌నగర్‌లోని ఫరూఖ్‌నగర్‌ ఈద్గా వద్ద గంజాయిని విక్రయించేందుకు వెళుతున్న అంజాద్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసు విచారణలో అంజాద్‌ తన బంధువు, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సుల్తాన్‌ బాగోతాన్ని బయటపెట్టాడు. దీంతో నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jun 06 , 2025 | 03:59 AM