Gram Panchayat Elections: ఓటరు జాబితా.. తప్పుల తడక
ABN , Publish Date - Aug 30 , 2025 | 02:03 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకలా ఉంది.
మృతి చెందినవారి ఓట్లు దర్శనం.. ఓపెన్ ప్లాట్లు, సర్వేనంబర్ల చిరునామాతో ఓటు హక్కు
ఒక్కో వ్యక్తికి రెండేసి ఓట్లు
రంగారెడ్డి అర్బన్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకలా ఉంది. తప్పుల్లేని జాబితాను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలిచ్చినా జాబితా అలా కనిపించడం లేదు. ఓటరు జాబితాలో తప్పులు సవరించడానికి సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారని అధికారులు వెల్లడించినా యథావిధిగా తప్పులతో జాబితా విడుదల కావడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గందరగోళంగా రంగారెడ్డి జిల్లా జాబితా
రంగారెడ్డిజిల్లాలో ఓటరు జాబితా గందరగోళంగా ఉంది. జిల్లాలోని 21 గ్రామీణ మండలాల్లో ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం మొత్తం ఓట్లు 7,52,254 కాగా, వీరిలో పురుషులు 3,76,873, మహిళలు 3,75,353 మంది ఉన్నారు. ప్రధానంగా చేవెళ్ల, యాచారం, మంచాల, చౌదరిగూడ, నందిగామ, కొత్తూరు, ఫరూఖ్‌నగర్, కందుకూరు తదితర మండలాల్లోని ఓటరు జాబితాలో పలు తప్పులు చోటు చేసుకున్నాయి. పలు గ్రామాల్లోని ఓటరు జాబితాలో చనిపోయినవారి పేర్లు దర్శనమిస్తున్నాయి. ఒకే వ్యక్తి పేరుమీద రెండేసి ఓట్లు ముద్రించడం, స్థానికంగా చిరునామా లేనివారికీ ఓట్లు కల్పించడం గమనార్హం. ఒకే ఇంటి నెంబర్‌పై 10 నుంచి 15 వరకు ఓట్లు కల్పించడంతో పాటు వివాహమై అత్తారింటికి వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించలేదు. కొన్ని గ్రామాల్లో వార్డుల విభజన సరిగ్గా జరగలేద న్న ఫిర్యాదులు వచ్చాయి. చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామ శివారుల్లోని ఓ ఫామ్‌హౌ్‌సలో పనిచేసే వ్యక్తుల పేరిట సుమారు 80 మందికి ఓటు హక్కు కల్పించారు. అంతేకాకుండా, ఓపెన్ ప్లాట్, సర్వేనెంబర్ల చిరునామాతో ఓటు హక్కు కల్పించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, ఓటరు జాబితాలో పేర్లు తొలగించడం ఇప్పుడు వీలుకాదని అధికారులు చెబుతున్నారు.
బోగస్ ఓట్లను తొలగించాలి
ఓటరు జాబితాను పారదర్శకంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. చనిపోయిన వారి ఓట్లు తొలగించడంలో విఫలమయ్యారు. ఇప్పటికైనా తప్పులు సవరించి బోగస్ ఓట్లను తొలగించాలి.
-డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..