Shankarpalli: ఇక్ఫాయి కళాశాల వద్ద గంజాయి కలకలం
ABN , Publish Date - Sep 05 , 2025 | 05:16 AM
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్స్ ఆఫ్ ఇండియా (ఇక్ఫాయి) కళాశాల సమీపంలో విద్యార్థులు గంజాయి తాగుతుండడం కలకలం రేపింది.
8 మంది విద్యార్థుల అరెస్టు
300 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్లు స్వాధీనం
శంకర్‌పల్లి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్స్ ఆఫ్ ఇండియా (ఇక్ఫాయి) కళాశాల సమీపంలో విద్యార్థులు గంజాయి తాగుతుండడం కలకలం రేపింది. ఎనిమిది మంది విద్యార్థులను రాజేంద్రనగర్ ఎస్వోటీ, మోకిల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 300 గ్రాముల గంజాయిని, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. వారితోపాటు హాస్టల్‌లో పనిచేసే ప్రొద్దుటూరుకు చెందిన రవి గైక్వాడ్‌కు కూడా పాజిటివ్ వచ్చింది.
విద్యార్థులను లోతుగా దర్యాప్తు చేయగా మహారాజ్‌పేట్‌కు చెందిన అంబూరి వంశీ (ర్యాపిడో డ్రైవర్) తమకు గంజాయి సరఫరా చేస్తాడని వారు తెలిపారు. కొంపల్లికి చెందిన మరో గంజాయి సరఫరాదారుడు వర్షిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. విద్యార్థులతో పాటు మహారాజ్‌పేట్, ప్రొద్దుటూరుకు చెందిన ఇద్దరు యువకులపై ఎన్‌డీపీఎ్‌స సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు మోకిల సీఐ వీరబాబు తెలిపారు.