Share News

‘ఫాల్కన్‌’పై ఈసీఐఆర్‌ నమోదు

ABN , Publish Date - Feb 22 , 2025 | 04:26 AM

ఫాల్కన్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) నమోదు చేశారు.

‘ఫాల్కన్‌’పై ఈసీఐఆర్‌ నమోదు

  • డిపాజిటర్ల నుంచి 1,700 కోట్లు వసూలు చేసిన సంస్థ

  • మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ ఈసీఐఆర్‌ నమోదు

హైదరాబాద్‌, ఫిబ్రవరి21(ఆంధ్రజ్యోతి): ఫాల్కన్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) నమోదు చేశారు. హైటెక్‌ సిటీ కేంద్రంగా ఫాల్కన్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 6,979 మంది డిపాజిటర్ల నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేసింది. పెట్టుబడి పెట్టిన మొత్తానికి ప్రతి సంవత్సరం 11ు నుంచి 22ు తిరిగి చెల్లింపులు చేస్తామని ప్రజల్ని నమ్మించి పెట్టుబడులు స్వీకరించింది. సంస్థ నిర్వాహకులు గత నాలుగు సంవత్సరాల్లో 6,979 మంది డిపాజిటర్ల నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేశారు. వసూలు చేసిన మొత్తంలో రూ.850 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించారు. మరో రూ.8500 కోట్లు క్రిప్టో కరెన్సీ ప్లాట్‌ఫాం, గోవాలో రిసార్టు, దుబాయ్‌లో రియల్‌ ఎస్టేట్‌, మలేషియాతోసహా వేర్వేరు ప్రాంతాల్లోని మొత్తం 14 షెల్‌ కంపెనీలకు మళ్లించారు. ఢిల్లీకి చెందిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసులు ఈ నెల 11న కేసు నమోదు చేశారు. సైబరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా విదేశాలకు నిధులు దారి మళ్లించడంతో మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ శుక్రవారం ఈసీఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.


అవినీతి కేసులో ఆస్తులు జప్తు చేసిన ఈడీ

లంచం కేసులో దొరికిన కేంద్ర ప్రభుత్వ అధికారి ఆస్తుల్ని ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. హైదరాబాద్‌లోని సీపీడబ్ల్యూడీలో ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వహించే సాయి కొమరేశ్వర్‌... కాంట్రాక్టర్‌కు బిల్లు క్లియర్‌ చేసేందుకు లంచం డిమాండ్‌ చేసి తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. సోదాల్లో రూ.30.50 లక్షల నగదు, బ్యాంకు లాకర్‌, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ కేసు ఆధారంగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)- 2002 కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. కొమరేశ్వర్‌, ఆయన భార్య పేరుతో ఉన్న సుమారు రూ.1.27 కోట్లు విలువైన స్థిరాస్తుల్ని తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

Updated Date - Feb 22 , 2025 | 04:26 AM