Bhoodan Land: ఈడీ సోదాలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 03:12 AM
భూదాన్ భూముల వివాదంపై ఈడీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సోదాలు నిర్వహించింది. వింటేజ్ కార్లు, కీలక పత్రాలు, నగదు స్వాధీనం చేసుకుని నిందితులపై దర్యాప్తు కొనసాగుతోంది
భూదాన్ భూముల వ్యవహారం.. నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు
40 వింటేజ్ కార్లు, భూదాన్ భూముల.. ఇతర ఆస్తుల కీలక పత్రాలు స్వాధీనం
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): భూదాన్ భూముల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని నిందితుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బృందాలు సోదాలు నిర్వహించాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం రెవెన్యూ పరిధిలో వివాదాస్పద భూమికి సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్, యాకత్‌పురా, బంజారాహిల్స్, మీర్‌పేట్, విరాట్‌నగర్, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైన సోదాలు సాయంత్రం 6.30 గంటల వరకు సాగాయి. నిందితులు షర్ఫన్, మునావర్ ఖాన్, ఖదీరున్నీసా, ఎంఏ షుకూర్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.
ఈ సోదాల్లో మునావర్‌ఖాన్‌కు చెందిన 40 వింటేజ్ కార్లు, భూదాన్ భూములతోపాటు ఇతర ఆస్తుల పత్రాలు, ఎఎలక్ట్రానిక్ పరికరాలు, కొంత నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హస్తినాపురం డివిజన్ విరాట్‌నగర్‌కు చెందిన ఎంఏ షుకూర్ నివాసంలో రూ.9.50లక్షల నగదుతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. నాగారంలోని సర్వే నంబరు 181, 182లోని భూదాన్ భూముల్లో వివాదం నెలకొంది. ఈ భూముల్లో సుమారు 50ఎకరాలకు సంబంధించి ఖదీరున్నీసా బేగం తండ్రి గతంలో భూదాన్ బోర్డుకు దానంగా ఇచ్చారు. ఆ భూములకు వారసురాలిని తానేనని, వాటిని తన పేరున బదిలీ చేయాలని 2021లో ఖదీరున్నీసా దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు ఆ భూమిని ఆమె పేరు మీద బదలాయించడంతో ఓ నిర్మాణ సంస్థకు విక్రయించారు. విలువైన భూమిని విచారణ లేకుండా బదలాయించడంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురికి నోటీసులు జారీ చేసి విచారించింది. రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌ను సైతం ఈడీ గతంలో విచారించింది.
ఇవి కూడా చదవండి
Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే
Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్