Falcon Scam: ఫాల్కన్ స్కామ్‌లో పట్టుబడ్డ ప్రైవేట్ జెట్ వేలానికి..
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:39 AM
ఫాల్కన్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్న ప్రైవేట్ జెట్ విమానాన్ని వేలం వేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
కోర్టులో ఈడీ అభ్యర్థన
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : ఫాల్కన్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) అధికారులు స్వాధీనం చేసుకున్న ప్రైవేట్ జెట్ విమానాన్ని వేలం వేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఫాల్కన్ స్కామ్ సూత్రధారి అయిన అమర్‌దీప్ కుమార్ గత ఏడాది ఆ ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేసి ఎయిర్ అంబులెన్స్‌గా తిప్పుతున్నారు. రూ.792 కోట్ల ఫాల్కన్ స్కామ్ బయటపడిన తర్వాత అమర్‌దీప్ కుమార్ అదే ప్రైవేట్ జెట్‌లో దుబాయి పారిపోయారు. ఈ ఏడాది మార్చిలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఆ ప్రైవేట్ జెట్‌ను ఈడీ అధికారులు సీజ్ చేశారు.
అయితే దాన్ని ఉపయోగించకుండా హ్యాంగర్‌లో ఉంచడం వల్ల సాంకేతిక సమస్యలు రావడంతోపాటు నిర్వహణ ఫీజు పెద్ద మొత్తంలో అవుతున్న నేపథ్యంలో వేలం వేయాలన్న ప్రతిపాదనను ఈడీ అధికారులు కోర్టు ముందుంచారు. ముందుగా దాని విలువను నిర్ధారించి ఆపై కోర్టు అనుమతితో వేలానికి వెళ్లాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.