Share News

Sridhar Babu: కులగణనపై ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు..

ABN , Publish Date - Feb 06 , 2025 | 04:31 AM

కులగణనపై ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ప్రతిపక్షాలను కోరారు. ఇది రాజకీయాలు చేసేందుకు సరైన సమయం కాదంటూ ప్రతిపక్షాలకు హితవు పలికారు.

Sridhar Babu: కులగణనపై ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు..

  • మీ రాజకీయాల కోసం అపోహలు స్పష్టించకండి

  • ప్రతిపక్ష నేతలకు మంత్రి శ్రీధర్‌బాబు హితవు

  • ‘స్థానికం’లో బీసీలకు 42% సీట్లిస్తామని స్పష్టం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): కులగణనపై ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ప్రతిపక్షాలను కోరారు. ఇది రాజకీయాలు చేసేందుకు సరైన సమయం కాదంటూ ప్రతిపక్షాలకు హితవు పలికారు. ‘కులగణన సర్వేను అత్యంత పకడ్బందీగా నిర్వహించాం. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఇంటింటికెళ్లి వివరాలు సేకరించాం. అయినా.. కొందరు పనిగట్టుకుని నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను అశాస్త్రీయంగా నిర్వహించింది. పారదర్శకతకు పాతరేసి తప్పుల తడకగా నివేదికను తయారు చేసింది. ఆ వివరాలను ప్రజల ముందు పెట్టలేదు.


అయినా దాని ప్రస్తావన 9ఏళ్ల తర్వాత ఇప్పుడు తెస్తున్నారు. ఆ తప్పును మేం సరిదిద్దాం. అందుకు మమ్మల్ని అభినందించాల్సింది పోయి విమర్శించడం ఎంతవరకు సమంజసం’ అంటూ ప్రశ్నించారు. ‘ప్రతిపక్షాలు బీసీలపై ఇప్పుడు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికీ.. ఎప్పటికీ బీసీలకు అండగా నిలబడేది కాంగ్రెస్సే.. మాటల్లో కాదు.. చేతల్లో చేసి చూపిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లను కేటాయిస్తాం. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు ఈ మాట చెప్పగలవా..?’ అని ప్రశ్నించారు.

Updated Date - Feb 06 , 2025 | 04:31 AM