Share News

Book Launch: రమణాచారి ‘హరే శ్రీనివాస’ పుస్తకావిష్కరణ

ABN , Publish Date - May 24 , 2025 | 04:11 AM

రమణాచారిని శ్రీనివాసుడు వదిలితే పుష్పగిరి శంకరుడు పట్టుకున్నాడని పుష్పగిరి పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి అన్నారు.

Book Launch: రమణాచారి ‘హరే శ్రీనివాస’ పుస్తకావిష్కరణ

  • తిరుమలలో గొప్ప సంస్కరణ తెచ్చిన ఘనత ఆయనదే: హరీశ్‌

రవీంద్రభారతి, మే 23 (ఆంధ్రజ్యోతి): రమణాచారిని శ్రీనివాసుడు వదిలితే పుష్పగిరి శంకరుడు పట్టుకున్నాడని పుష్పగిరి పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో శుక్రవారం కిన్నెర సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ కె.వి. రమణాచారి రచించిన ‘హరే శ్రీనివాస’ అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి మాట్లాడుతూ.. అసాధ్యాలను సుసాధ్యం చేసిన రమణాచారి అద్భుత సత్యాల హారం ‘హరే శ్రీనివాస’ అని.. భవిష్యత్‌లో పుష్పగిరి శ్రీనివాస పుస్తకం రావాలని ఆకాంక్షించారు.


కళాకారుల శ్రేయస్సు కోసం తపించడంతోపాటు పలు విజయాలు సాధించిన రమణాచారి ఈ పుస్తకం తేవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ రమణాచారి ఏ పదవిలో ఉన్నా.. ఆ పదవికే ఔన్నత్యాన్ని తెచ్చారన్నారు. బ్రాహ్మణుల్లోనూ పేదలుంటారని గుర్తించడంతోపాటు వారి కోసం రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ ఏర్పాటులో రమణాచారి పాత్ర గొప్పదని అన్నారు. జి. వల్లీశ్వర్‌ ఈ పుస్తకాన్ని సమీక్షించారు. చివరిగా రమణాచారి మాట్లాడుతూ.. తన పుస్తకావిష్కరణకు గొప్ప వారు వచ్చినందుకు ఆనంద దాయకం అని తెలిపారు. తిరుమలలో గడిపిన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచానని చెప్పారు.

Updated Date - May 24 , 2025 | 04:11 AM