Gandhi Hospital: హే ‘గాంధీ’.. గుండె రోగులకు ఏందీ బాధ!
ABN , Publish Date - Mar 12 , 2025 | 03:51 AM
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఓపీ కార్డియో విభాగంలో వైద్యులు ఏమాత్రం సమయపాలన పాటించడంలేదు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న రోగులు డాక్టర్ల కోసం గంటల తరబడి వేచిఉండాల్సి వస్తోంది.

ఓపీ ‘కార్డియో’లో ఖాళీ కుర్చీలు దర్శనం..ఉదయం 11 గంటలైనా వైద్యుల జాడే లేదు
గంటల తరబడి వేచి చూస్తూ రోగుల అవస్థలు.. మంత్రి హెచ్చరికలు బే ఖాతర్
అడ్డగుట్ట, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఓపీ కార్డియో విభాగంలో వైద్యులు ఏమాత్రం సమయపాలన పాటించడంలేదు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న రోగులు డాక్టర్ల కోసం గంటల తరబడి వేచిఉండాల్సి వస్తోంది. సోమ, మంగళ, గురు, శుక్రవారం.. ఈ నాలుగు రోజుల్లో ఓపీ కార్డియో విభాగంలో రోగులకు వైద్య సేవలందిస్తారు. ఈ క్రమంలో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ గాంధీ ఆస్పత్రిని విజిట్ చేయగా.. ఉదయం 11 గంటల సమయంలో కార్డియో విభాగానికి చెందిన ప్రొఫెసర్ రూంలో రెండు కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఆ సమయంలో బయట దాదాపు 60 మంది రోగులు వైద్యుల కోసం ఎదురుచూస్తున్నారు. పక్కనే ఒక పీజీ వైద్యుడు సాయి మోహన్ ఉదయం 9.20 నిమిషాలకు కార్డియో విభాగానికి చేరుకుని రోగులకు వైద్య సేవలందిస్తున్నారు.
కార్డియో హెచ్‌వోడి, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎవరు కూడా కార్డియో విభాగంలో కనిపించలేదు. దాంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు గంటల తరబడి వేచిఉండాల్సి వచ్చింది. ఓపిక నశించిన వారు వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల గాంధీ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర నర్సింహ.. వైద్య సేవల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దంటూ వైద్యులకు సూచించారు. అయినా.. సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజకుమారి, కార్డియో థెరపి విభాగాధిపతి ప్రొఫెసర్ నితిన్ కోబ్రా.. వైద్యుల హాజరు, సమయపాలనపై దృష్టి పెట్టడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందుతున్న రోగుల్ని డాక్టర్ నితిన్ కొబ్రా పట్టించుకోవడంలేదన్న విమర్శలూ వస్తున్నాయి. కార్డియో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆస్పత్రికి రావడంలేదని, కేవలం పీజీ వైద్యులు జూనియర్ వైద్యులు మాత్రమే కార్డియో రోగులకు వైద్యం చేస్తున్నారని చికిత్స పొందుతున్న రోగుల సహయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు
Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..