Share News

Warangal: భార్య పన్నాగానికి బలైన వైద్యుడు

ABN , Publish Date - Mar 02 , 2025 | 04:40 AM

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి భార్య చేయించిన హత్యాయత్నంతో ఆస్పత్రి పాలైన వరంగల్‌కు చెందిన వైద్యుడు గాదె సుమంత్‌ రెడ్డి(37) మరణించారు.

Warangal: భార్య పన్నాగానికి బలైన వైద్యుడు

  • హత్యాయత్నానికి గురైన సుమంత్‌మృతి

  • వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని దారుణానికి ఒడిగట్టిన భార్య

  • ప్రియుడితో కలిసి ఘాతుకం

కరీమాబాద్‌, సంగారెడ్డి క్రైం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి భార్య చేయించిన హత్యాయత్నంతో ఆస్పత్రి పాలైన వరంగల్‌కు చెందిన వైద్యుడు గాదె సుమంత్‌ రెడ్డి(37) మరణించారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. వరంగల్‌కు చెందిన సుమంత్‌రెడ్డి, ఫ్లోరా మరియా 2016లో ప్రేమవివాహం చేసుకున్నారు. సంగారెడ్డిలో బంధువులకు చెందిన విద్యాసంస్థల వ్యవహారాలను చూసుకునేందుకు వీరు 2018లో సంగారెడ్డికి వెళ్లి నివాసమున్నారు. ఆ సమయంలో సుమంత్‌ సంగారెడ్డి పీహెచ్‌సీలో మెడికల్‌ అధికారిగా పని చేయగా.. ఫ్లోరా బంధువుల పాఠశాలలో టీచర్‌గా పని చేసింది. సంగారెడ్డిలో ఓ జిమ్‌లో చేరిన ఫ్లోరా.. అక్కడ జిమ్‌ ట్రైనర్‌, సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ ఆదర్శకాలనీకి చెందిన ఏర్రొల్ల శామ్యూల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న సుమంత్‌ రెడ్డి.. తమ నివాసాన్ని తిరిగి హనుమకొండ హంటర్‌రోడ్‌కు మార్చారు. ఖాజీపేటలో సొంతంగా ఆస్పత్రి నిర్వహిస్తూ రోజూ అక్కడికి వెళ్లివచ్చేవారు. మరోపక్క, 2019లో ప్రభుత్వ అధ్యాపకురాలిగా ఉద్యోగం పొందిన ఫ్లోరా.. వరంగల్‌ రంగశాయిపేట కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసింది. అయితే, పద్ధతి మార్చుకోని ఫ్లోరా.. శామ్యూల్‌తో తన సంబంధాన్ని కొనసాగించింది.


ఈ విషయం తెలిసి సుమంత్‌ రెడ్డి నిలదీయగా దంపతుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న ఫ్లోరా.. శామ్యూల్‌తో కలిసి పథకం వేసింది. హత్యకు సహకరించాలని శామ్యూల్‌ తన స్నేహితుడు, సైబరాబాద్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సంగారెడ్డికి చెందిన మంచుకూరి రాజ్‌కుమార్‌ను కోరాడు. అతనికి ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇవ్వడంతో అంగీకరించాడు. దీంతో ఫిబ్రవరి 20న శామ్యూల్‌, రాజ్‌కుమార్‌ కలిసి సుమంత్‌ రెడ్డి ప్రయాణించే మార్గంలో రెక్కీ నిర్వహించి హత్యకు అనువైన చోటు ఎంపిక చేసుకున్నారు. అనంతరం ఖాజీపేట చేరుకుని.. విధులు ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరిన సుమంత్‌ రెడ్డిని ద్విచక్రవాహనంతో వెంబడించారు. పథకం ప్రకారం రాత్రి 9.30గంటలప్పుడు భట్టుపల్లి వద్ద సుమంత్‌ రెడ్డి కారును అడ్డుకుని అతనిపై సుత్తితో దాడి చేశారు. అతడు చనిపోయాడని భావించి పరారయ్యారు. అయితే, రక్తపుమడుగులో పడి ఉన్న సుమంత్‌రెడ్డిని తొలుత ఎంజీఎంకు, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న సుమంత్‌ ప్రాణాలు కోల్పోయారు. నిందితులైన ఫ్లోరా మరియా, శామ్యూల్‌, రాజ్‌కుమార్‌ను పోలీసులు ఫిబ్రవరి 27నే అరెస్టు చేశారు.

Updated Date - Mar 02 , 2025 | 04:40 AM