Share News

కొంపల్లి నుంచి డయల్‌ 100 తరలింపు

ABN , Publish Date - Jun 21 , 2025 | 04:34 AM

ఆపదలో ఆదుకునే నేస్తం డయల్‌ 100 సేవలు ఇకపై పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి అందుబాటులోనికి రానున్నాయి. ఇప్పటివరకు ఈ సేవలను హైదరాబాద్‌ కొంపల్లి నుంచి అందిస్తున్నారు.

కొంపల్లి నుంచి డయల్‌ 100 తరలింపు

  • కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి నిర్వహణ

  • అత్యవసర సేవల సర్వీసు 112కు డయల్‌ 100 లింక్‌

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఆదుకునే నేస్తం డయల్‌ 100 సేవలు ఇకపై పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి అందుబాటులోనికి రానున్నాయి. ఇప్పటివరకు ఈ సేవలను హైదరాబాద్‌ కొంపల్లి నుంచి అందిస్తున్నారు. ఇకపై తెలంగాణ ఇంటిగ్రేటేడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(టీజీఐసీసీసీ) నుంచి కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అత్యవసర సేవల సర్వీసు నెంబర్‌ 112కు డయల్‌ 100ను అనుసంధానం చేయనున్నారు. పోలీసు, ఫైర్‌, ఆంబులెన్స్‌, చిన్నారుల అదృశ్యం, మహిళా భద్రత, ఇలా రకరకాల ఆపదల నుంచి రక్షణ కోసం ఒక్కో శాఖ ఒక ఎమర్జెన్సీ నెంబర్‌ను కేటాయించింది. ప్రజలు ఇన్ని నెంబర్లను గుర్తుంచుకోవడం కన్నా అత్యవసర సర్వీసులన్నీ ఒకే నెంబర్‌తో అనుసంధానం చేయాలని భావించిన కేంద్రం అన్ని రాష్ట్రాల్లో డయల్‌ 112 సేవలను ప్రారంభించింది.


ఇప్పటికే ఆపరేషన్‌లో ఉన్న వివిధ అత్యవసర సర్వీసులను డయల్‌ 112తో కలపనున్నారు. ఈ క్రమంలోనే డయల్‌ 100 తరలింపు ప్రక్రియ ప్రారంభమైందని ఇకపై పోలీసుశాఖే డయల్‌ 100 నిర్వహణ కొనసాగిస్తుందని టీజీఐసీసీసీ డైరెక్టర్‌ కమలాసన్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మహిళా భద్రతకు సంబంధించిన 181, చైల్డ్‌ ప్రొటెక్షన్‌కు సంబంధించి 1098 నెంబర్లను డయల్‌ 112తో అనుసంధానం చేశామని ఆయన వివరించారు. అగ్నిమాపకశాఖకు చెందిన 101, ఆంబులెన్స్‌లకు సంబంధించిన 108, డిజాస్టర్‌ రెస్పాన్స్‌కు సంబంధించిన 1077 నెంబర్లను త్వరలో 112కు అనుసంధానం చేయనున్నామని పేర్కొన్నారు. కొన్నాళ్లు డయల్‌ 100,112 యధావిథిగా కొనసాగుతాయని తెలిపారు.

Updated Date - Jun 21 , 2025 | 04:34 AM