Share News

మన దగ్గర కూడా ప్రపంచ ఫేమస్ హిందూ దేవాలయం

ABN , Publish Date - Jun 29 , 2025 | 10:18 AM

ములుగు జిల్లా కొత్తూరు సమీపంలోని దేవునిగుట్టలపై అద్భుత కళాకృతులతో ఓ ఆలయం ఉంది. దేవునిగుట్ట ఆలయంగా స్థానికులు పిలుచుకుంటున్నారు.

మన దగ్గర కూడా ప్రపంచ ఫేమస్ హిందూ దేవాలయం

‘ఆంకోర్‌ వాట్‌’... ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా పేరు గాంచింది. కాంబోడియాలోని ఈ ఆలయ నిర్మాణ శైలిని పోలిన ఆలయం వరంగల్‌ సమీపంలోని ములుగు అడవుల్లో ఉన్న దేవుని గుట్టపై ఉంది. భారతదేశ శిల్ప చరిత్రలోనే విశిష్టమైన నిర్మాణంగా, శిల్పాకళా చరిత్రలో ఓ మైలురాయిగా ఈ కట్టడం నిలుస్తుంది. ఆ విశేషాలే ఇవి...

ములుగు జిల్లా కొత్తూరు గ్రామం సమీపం లోని దేవునిగుట్టలపై అద్భుత కళాకృతులతో ఓ ఆలయం ఉంది. దేవునిగుట్ట ఆలయంగా స్థానికులు పిలుచుకుంటున్నారు. ఈ గుట్టలపై లభించే ఇసుకరాయిని ఉపయోగించి గుడి నిర్మాణం చేశారు.


ఇసుకరాతిని (2గీ2 అడుగులు, 2గీ1 అడుగుల కొలతలో) రాతి బిళ్లలుగా చేసుకుని ఆలయ నిర్మాణం చేశారు. తొమ్మిది అడుగుల మందంతో మధ్యలో ఖాళీని వదిలిన రెండు పొరల గోడను పిరమిడ్‌ మాదిరిగా శిఖరం వైపు వెళుతున్న కొద్ది విస్తీర్ణం తగ్గించుకుంటూ నిర్మించారు. ఆలయం లోపలికి వెళ్లడానికి తూర్పువైపు ఒకే ద్వారం ఉంది. ఆలయం లోపల గోడల మీద బుద్ధజాతక కథలకు చెందిన కథా దృఽశ్యాలు చెక్కిఉన్నాయి. బుద్ధుడు తన శిష్యులకు బోధిస్తున్న దృశ్యాలు మూడు చోట్ల దర్శనమిస్తాయి. ఒక చోట యుద్ధ సన్నివేశం చెక్కారు. ఆ యుద్ధ దృశ్యంలో చేతిలో ఖడ్గంతో కుషానుని పోలిన శిల్పం ఉంది. మిగతా రెండు గోడల మీద కూడా బౌద్ధ జాతక కథల ఇతివృత్తానికి చెందిన శిల్పాలున్నాయి.


బౌద్ధ స్థావరంగా...

గుడిబయట ఒక మూలన పాలరాతి స్తంభం నిలబెట్టి ఉంది. ఇది బౌద్ధ స్తూపాల వద్ద పాతి ఉంచే ఆయకస్తంభంగా చరిత్ర కారులు చెబుతున్నారు. ఆయక స్తంభానికి నాలుగు వైపులా అర్థ పద్మాలు, సింహాలు చెక్కి ఉన్నాయి. ఈ ఆయక స్తంభం క్రీ.శ. 1 లేదా 2వ శతాబ్దాలకు చెందినదిగా చరిత్ర కారులు భావిస్తున్నారు. ఈ స్థలంచైత్యాలయం కన్నా ముందు నుంచే బౌద్ధ స్థావరంగా ఉండేదని అంటున్నారు.

book4.2.jpg


దక్షిణం వైపు గోడ మీద అజంతా చిత్రాలలోని పద్మపాణిని పోలిన బోధిసత్వుడు రాచ కొలువులో లలితాసనంలో రాణితో కూర్చున్న దృశ్యం ఉంది. ఉత్తర, దక్షిణ రెండు పక్కల బోధిసత్వుడుని అవతార రూపాల శిల్పాలు ఉన్నాయి. పడమటి వైపు గోడమీద దిగువన అర్థనారీశ్వర శిల్పం చెక్కి ఉంది. ఈశ్వరుని అర్థభాగం, పార్వతి అర్థభాగం స్పష్టంగా చెక్కారు. దానిపై వరుసలో బుద్ధిని బోధనలు వింటున్నరాజులు, రాణులు, పరివారం, మిథునాలు ఉన్నాయి.


book4.3.jpg

పై అంచులో రాతిఇటుకలపై సాగర మథనం చెక్కబడి ఉంది. ఈశాన్య మూలన ఉన్న అమితాభుని శిరస్సు శిల్పం కాంబోడియా ‘ఆంకోర్‌ వాట్‌’ దేవాలయం మీద పెద్ద రాతిముక్కల శిల్పానికి మాతృక అనిపిస్తుందని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. ఈ దేవాలయంలోని శిల్పాలు అజంతా, అమరావతి, ఫణిగిరి, నాగార్జునకొండ బౌద్ధ శిల్పాలతోనూ, ఒరిస్సాలోని స్కందగిరి, ఉదయగిరి శిల్పాలతో పోలికలు ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. దేవునిగుట్టలపైన ఈ గుడి చుట్టు రాతి ఇటుకల పలకలపై చెక్కిన 1,600లకు పైగా శిల్పాలు ఉన్నాయి.


అనేక శిలలు... ఒకే శిల్పంగా...

వివిధ శిలలను చెక్కి ఒకే శిల్పంగా నిలిపి నిర్మించిన అపురూప నిర్మాణం ఈ ఆలయం. కాంబోడియాలోని ‘ఆంకోర్‌ వాట్‌’ కన్నా ముందే తెలంగాణలో అటువంటి నిర్మాణం జరిగినట్లు ఈ ఆలయం నిరూపించిందని చరిత్ర పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆలయ నిర్మాణ శైలిని బట్టి ఇది క్రీ.శ 6 లేదా 7వ శతాబ్దానికి చెందిన కట్టడంగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ‘ఆంకోర్‌ వాట్‌’ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించారు.


అంటే అంతకన్నా పూర్వమే దేవునిగుట్టపై ఇనుపరాతి ఇటుకలతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా భావిస్తున్నారు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన శాసనం లేకపోవటంతో ఎప్పుడు నిర్మించారో స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ, విష్ణుకుండినుల కాలం నాటి ఆలయ నిర్మాణ పద్ధతులు ఈ ఆలయ నిర్మాణానికి సారూప్యత ఉండటంతో... వారి హయంలోనే ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని భావిస్తున్నారు.


చరిత్రకారుడు అరవింద్‌ ఆర్య సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులు చూసి అనేకమంది విదేశీ చరిత్ర కారులు ఈ గుడి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. జర్మనీకి చెందిన కొరీనా వెస్సెల్స్‌, ఇంగ్లాండ్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్చర్‌ ప్రొఫెసర్‌ ఆడం హార్డీ, ఇటలీకి చెందిన ఆండ్రీ తదితరులు ఈ గుడిని సందర్శించారు.


అభివృద్ధి చేస్తే అద్భుతమే...

ములుగు జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చారిత్రక ఆలయం నిర్వహణ లేకపోవటంతో గోడల రాళ్లు కదిలిపోతున్నాయి. అతిపురాతన ఆలయ చరిత్ర చెదిరిపోతోంది. ఆలయ శిఖరం పైభాగం లేకపోవటంతో వర్షం నీళ్లు ఆలయంలో పడుతున్నాయి. దీంతో ఆలయ పునాదుల్లోకి నీళ్లు చేరుతున్నాయి. గర్భగుడిలో లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని 2012లో ఏర్పాటు చేసుకుని స్థానికులు పూజలు చేస్తున్నారు. ఈ చారిత్రక కట్టడాన్ని సంరక్షించి, మరిన్ని పరిశోధనలు జరిపితే అద్భుత విశేషాలు వెల్లడయ్యే అవకాశాలు లేకపోలేదు.

- తడుక రాజనారాయణ, వరంగల్‌

ఫొటోలు: వీరగోని హరీష్‌

Updated Date - Jun 29 , 2025 | 10:23 AM