Bhatti Vikramarka: విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:06 AM
సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి మంగళవారం ఆయన ప్రజాభవన్‌లో సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల (డీఎం అండ్ హెచ్‌వో)తో కలెక్టర్లు సమన్వయం చేసుకుని విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ కార్డులను రూపొందించాలని డిప్యూటీ సీఎం చెప్పారు.
సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధికారుల పర్యటన, సమీక్షపై పకడ్బందీ క్యాలెండర్‌ను తయారు చేయాలని చెప్పారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లపై నివేదికను రూపొందించాలన్నారు. గురుకుల విద్యాలయాల భవనాలపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, విద్యుత్తు అవసరాలను తీర్చేందుకు అవసరమైన ప్రణాళికను తయారు చేయాలన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి అలుగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు.