Share News

ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే ఆపాలి..

ABN , Publish Date - Jun 06 , 2025 | 03:36 AM

హింసకు హింస సమాధానంకాదని, ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టులతోపాటు అమాయక గిరిజనులను కూడా కాల్చి చంపుతున్నారని పలువురు వక్తలు ఆరోపించారు. ఆపరేషన్‌ కగార్‌ను ఆపాలని, మావోయిస్టులతో వెంటనే చర్చలు జరపాలని వారు డిమాండ్‌ చేశారు.

ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే ఆపాలి..

  • మావోయిస్టులతో కేంద్రం వెంటనే శాంతి చర్చలు జరపాలి

  • రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల డిమాండ్‌

పంజాగుట్ట, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): హింసకు హింస సమాధానంకాదని, ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టులతోపాటు అమాయక గిరిజనులను కూడా కాల్చి చంపుతున్నారని పలువురు వక్తలు ఆరోపించారు. ఆపరేషన్‌ కగార్‌ను ఆపాలని, మావోయిస్టులతో వెంటనే చర్చలు జరపాలని వారు డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రికి లక్ష వినతి పత్రాలు పంపాలని తీర్మానించారు. ‘ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి’ అనే అంశంపై గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌ వెన్నెల గద్దర్‌ ఆధ్వర్యంలో పసునూరి రవీందర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌, గద్దర్‌ సతీమణి విమల గద్దర్‌, సినీనటుడు ఆర్‌.నారాయణ మూర్తి, ఉద్యోగ సంఘం మాజీ నాయకుడు దేవీప్రసాద్‌, ప్రొఫెసర్‌ భాగ్య భూక్య, దళిత నాయకుడు జేబీ రాజు, పలు రంగాల మేధావులు, పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడారు. మన దేశ పౌరులే సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారని, వాటిని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సింది పోయి వారిపై దాడులకు దిగడం సరికాదని కోదండరాం అన్నారు.


చట్ట ప్రకారం ఎవరైనా చర్చలకు సిద ్ధపడ్డప్పుడు చర్చలు జరపాలే కానీ యుద్ధం సాగించడం సరికాదని చెప్పారు. దండకారణ్యంలో ఖనిజ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టడానికే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల విషయంలో మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించకపోవడం దుర్మార్గమని చెప్పారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించినా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమానవీయంగా మావోయిస్టులను హత మార్చడం దారుణమని మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. హింసకు హింస సమాధానంకాదని, ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టులతో పాటు అమాయక గిరిజనులనూ కాల్చి చంపుతున్నారని ఆరోపించారు. ఆపరేషన్‌ కగార్‌ను ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని తమలాంటి వారు కోరితే అర్బన్‌ నక్సలైట్లు అంటున్నారన్నారు. గిరిజన ప్రాబల్య ప్రాంతాలపై ఆధిపత్యం సాధించి వనరులను అదానీ, అంబానీ లాంటి వారికి కట్టబెట్టేందుకే ఈ మారణ హోమం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. దీనిని ఆపేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించాలని, సుప్రీంకోర్టు అయినా సుమోటోగా స్వీకరించి ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయించాలని కోరారు.

Updated Date - Jun 06 , 2025 | 03:37 AM