ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:42 AM
ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. షమీర్ అక్తర్ నివేదికలో లోపాలు ఉన్నాయని, వర్గీకరణ చట్టరూపం దాల్చకముందే లోపాలను సరిచేయాలని కోరారు.

వర్గీకరణ చట్టరూపం దాల్చక ముందే లోపాలు సరిచేయాలి: మందకృష్ణ
బర్కత్‌పుర, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. షమీర్ అక్తర్ నివేదికలో లోపాలు ఉన్నాయని, వర్గీకరణ చట్టరూపం దాల్చకముందే లోపాలను సరిచేయాలని కోరారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మిత అయ్యాల్వార్ సంఘం అధ్యక్షుడు యండ్రపల్లి రాంబాబు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పొల్గొన్న మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, ఎస్సీలలో కొన్ని కులాలకు ఆర్డీఓ ద్వారా, మరికొన్ని కులాలకు తహసీల్దార్ ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.
వీటిని పరిష్కరించేందుకు అన్ని కులాలకు తహసీల్దార్ ద్వారానే ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. గ్రూప్- 3లో ఉన్న ఇబ్బందులను ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, వాటిని సవరించి అన్ని కులాలకు న్యాయం చేయాలని విన్నవించారు. మహార్, నేతకాని, గోసంగి కులాలు మాల కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారని, అవసరం అయితే మాలలను డీ గ్రూప్‌లో చేర్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాదిగలతో పాటు అన్యాయానికి గురైన అన్ని కులాల పక్షాన పోరాడతామని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.