Share News

నక్సల్స్‌ మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించాలి

ABN , Publish Date - May 24 , 2025 | 04:40 AM

నారాయణపూర్‌ ఎన్‌కౌంటర్‌లో అమరులైన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని పలు ప్రజా సంఽఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

నక్సల్స్‌ మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించాలి

  • పలు ప్రజా సంఘాల నేతల డిమాండ్‌

  • కగార్‌ను నిలిపి వేయాలంటూ గవర్నర్‌కు గద్దర్‌ సతీమణి, కూతురు వెన్నెల వినతి

బర్కత్‌పుర/పంజాగుట్ట/మిర్యాలగూడ, మే 23 (ఆంధ్రజ్యోతి): నారాయణపూర్‌ ఎన్‌కౌంటర్‌లో అమరులైన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని పలు ప్రజా సంఽఘాల నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ లో మీడియాతో అమరుల బంధుమిత్రుల సంఘం నేత భవాని, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ఐఎ్‌ఫటీయూ నేత అనురాధ, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమప్రతినిధి రాజు, అరుణోదయ సాంస్కృతిక ప్రతినిధి పోతుల సురేశ్‌తో పాటు తెలంగాణ ప్రజా ఫ్రంట్‌, ఐఏపీఎల్‌ తదితర సంఘాల నేతలు మాట్లాడారు. ఆపరేషన్‌ కగార్‌ను తక్షణమే నిలిపేయాలన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లపై న్యాయవిచారణ జరిపించాలని, చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు బంధువుల సమక్షంలో శవ పంచనామా చేయాలని డిమాండ్‌ చేశారు.


కాగా, మానవతా దృక్పథంతో ఆపరేషన్‌ కగార్‌ను తక్షణమే నిలిపేయాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను దివంగత గద్దర్‌ సతీమణి విమల, కూతురు వెన్నెల కోరారు. ఈమేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. కాగా, ఆపరేషన్‌ కగార్‌ విషయంలో మానవ హక్కులవేదిక (హెచ్‌ఆర్‌ఎ్‌ఫ)మౌనం వహించడం క్షమించరానిదని ఆ సంస్థ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పి.సుబ్బారావు అన్నారు. మాట్లాడాల్సిన సమయంలో హెచ్‌ఆర్‌ఎ్‌ఫ మౌనం వహించినందుకు నిరసనగా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నంబాల కేశవరావు, సజ్జా వెంకట నాగేశ్వరరావు మృత దేహాలను తనకు అప్పగించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు శుక్రవారం హైకోర్టులో హౌజ్‌మోషన్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

Updated Date - May 24 , 2025 | 04:40 AM