Share News

Cyber fraud: ఆర్మీ అధికారికి పూజలు చేయాలంటూ.. పూజారికి కుచ్చుటోపీ!

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:37 AM

సైబర్‌ నేరగాళ్లు పూజలు చేయాలంటూ ఓ పూజారికే కుచ్చుటోపీ పెట్టారు. ఆర్మీ అధికారి ఆరోగ్యం బాగుపడడానికి పూజలు చేయాలని నమ్మించి.. రూ.6 లక్షలు కొట్టేశారు

Cyber fraud: ఆర్మీ అధికారికి పూజలు చేయాలంటూ.. పూజారికి కుచ్చుటోపీ!

  • రూ.10 పంపి.. రూ.6 లక్షలు కొట్టేశారు

  • సీసీఎ్‌సలో ఫిర్యాదు చేసిన బాధిత పూజారి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లు పూజలు చేయాలంటూ ఓ పూజారికే కుచ్చుటోపీ పెట్టారు. ఆర్మీ అధికారి ఆరోగ్యం బాగుపడడానికి పూజలు చేయాలని నమ్మించి.. రూ.6 లక్షలు కొట్టేశారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. పురానాపూల్‌కు చెందిన 52 ఏళ్ల పూజారికి రెండు రోజుల క్రితం గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. తనను తాను కెప్టెన్‌ అమన్‌కుమార్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి సికింద్రాబాద్‌ ఆర్మీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. తమ కర్నల్‌కు ఆరోగ్యం బాగోలేదని, 21 మంది పండితులతో 11 రోజులపాటు పూజలు చేయాలని కోరాడు. దీనికి పూజారి సరే అన్నారు. అడ్వాన్‌గా రూ.3 లక్షలు ఇస్తామని, తర్వాత మిగిలిన డబ్బు ఇస్తామని నమ్మబలికాడు. ఆర్మీ నిబంధనల ప్రకారం.. ముందుగా తాము కొంత నగదు బదిలీ చేస్తామని, నిర్ధారించుకొని, మిగిలిన డబ్బు పంపుతామని నమ్మించాడు.


ముందు రూ.10 ఫోన్‌పే చేశాడు. ఆ తర్వాత పూజారికి చెందిన మరో ఫోన్‌ నంబరు అడిగి, దానికి వీడియోకాల్‌ చేశాడు. ఆర్మీ దుస్తుల్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ.. డబ్బులు అకౌంట్‌కు బదిలీ చేస్తున్నట్లుగా నమ్మించి గూగుల్‌పే, ఫోన్‌పే యాప్‌లను ఓపెన్‌ చేయించి.. డెబిట్‌ కార్డు నంబరు, పిన్‌ నంబర్లను తెలుసుకున్నాడు. పూజారిని తన మాటలతో ఏమార్చి అతనితోనే ఖాతాలోని డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. అలా విడతలవారీగా రూ.5,99,999 కొల్లగొట్టారు. మోసపోయిన విషయాన్ని గుర్తించిన పూజారి.. ఆర్మీ అధికారికి ఫోన్‌ చేయగా, ఆ వ్యక్తి స్పందించలేదు. వెంటనే సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Aug 26 , 2025 | 01:37 AM