Share News

Cyber Crime: మీ అకౌంట్‌లో డబ్బు వేస్తాం.. మేం చెప్పిన వాళ్లకు పంపండి

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:35 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో మీ సేవా కేంద్రం నడుపుతున్న బోడా శ్రీధర్‌ అనే వ్యక్తికి టెలిగ్రామ్‌ ద్వారా కొందరు(సైబర్‌ నేరగాళ్లు) పరిచమయ్యారు

Cyber Crime: మీ అకౌంట్‌లో డబ్బు వేస్తాం.. మేం చెప్పిన వాళ్లకు పంపండి

  • సైబర్‌ నేరగాళ్ల కొత్త తరహా మోసం

  • కమీషన్ల కక్కుర్తితో జైలు పాలైన 13 మంది యువకులు

కొత్తగూడెం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో మీ సేవా కేంద్రం నడుపుతున్న బోడా శ్రీధర్‌ అనే వ్యక్తికి టెలిగ్రామ్‌ ద్వారా కొందరు(సైబర్‌ నేరగాళ్లు) పరిచమయ్యారు. ఏవైనా బ్యాం కుల్లో కరెంట్‌ ఖాతాలను తెరవాలని, వాటిల్లోకి వచ్చే డబ్బును వేరేవాళ్ల అకౌంట్లకు పంపిస్తే కమీషన్‌ ఇస్తామని చెప్పారు. దీంతో, శ్రీధర్‌తో పాటు మరో 12 మంది యువకులు నకిలీ పత్రాలతో కొత్తగూడెంలోని ఐదు బ్యాంకుల్లో కరెంట్‌ అకౌంట్లను తెరిచారు. ఆ ఖాతాల నుంచి సైబర్‌ నేరగాళ్లు చెప్పిన అకౌంట్లకు నగదును బదిలీ చేస్తూ కమీషన్లు పొందారు.


మరోవైపు, సైబర్‌ నేరగాళ్ల మాయతో డబ్బు పోగొట్టుకున్న బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సైబర్‌ క్రైం అధికారులు దర్యాప్తు చేయగా.. డబ్బంతా ఈ ఖాతాల్లోకి వెళ్తోందని గుర్తించి ఫ్రీజ్‌ చేశారు. అనంతరం జిల్లా పోలీసులకు సమాచారమిచ్చారు. టేకులపల్లి, సైబర్‌ క్రైం పోలీసుల విచారణలో నిందితులకు చెందిన ఖాతాల నుంచి రూ.8.50 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేలింది. దేశవ్యాప్తంగా వీరి బ్యాంకు ఖాతాలపై 108 ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో 13 మంది యువకులను ఆదివారం టేకులపల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Aug 26 , 2025 | 01:35 AM