Share News

CPI: బీజేపీ జేబు సంస్థగా ఈసీ : బీవీ రాఘవులు

ABN , Publish Date - Aug 13 , 2025 | 05:25 AM

ఎన్నికల సంఘం బీజేపీ జేబు సంస్థలా పని చేస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. ఎన్నికల సంఘం ఎన్డీయే కూటమిలో ఓ పార్టీలా వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే బిహార్‌లో ఎస్‌ఐఆర్‌(ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) చేపట్టిందని అన్నారు.

CPI: బీజేపీ జేబు సంస్థగా ఈసీ : బీవీ రాఘవులు

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం బీజేపీ జేబు సంస్థలా పని చేస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. ఎన్నికల సంఘం ఎన్డీయే కూటమిలో ఓ పార్టీలా వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే బిహార్‌లో ఎస్‌ఐఆర్‌(ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) చేపట్టిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా ‘రాజ్యాంగం- ఎన్నికల కమిషన్‌- దొంగ ఓట్లు’ అంశంపై హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన హిట్లర్‌ రాజ్యాంగాన్ని తొలగించారని, మోడీ ప్రభుత్వం కూడా అదే తరహా పాలన చేస్తుందని తెలిపారు. బీజేపీ నియో ఫాసిస్టు విధానాలపై సెప్టెంబరు 12 దాకా నెల రోజుల పాటు దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తామని ప్రకటించారు. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కమ్యూనిస్టులంటే భయమని రాఘవులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, మోదీ హయాంలో పార్లమెంట్‌కు ప్రాధాన్యం ఉండడం లేదని, ఎంపీలు ప్రశ్నిస్తే అణిచి వేస్తున్నారని ఈ సదస్సులో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ ఆరోపించారు.

Updated Date - Aug 13 , 2025 | 05:25 AM